వేమూరు: మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. వేమూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వేమూరు మండలం వెల్లబాడు గ్రామానికి చెందిన ఈపూరు యోహాన్, అదే గ్రామానికి చెందిన చరణ్ తేజకు లైబ్రరీ వద్ద శుక్రవారం వివాదం నెలకొంది. ఈ వివాదం తీవ్రతరం కావడంతో చరణ్ తేజ లైబ్రరీ ప్రక్కన ఉన్న ఇంటిలోకి వెళ్లి చాకు తీసుకొని వచ్చి యోహాన్ ఛాతీ వెనుక భాగంలో పొడిచాడు. దీంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకొని వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. 108 వాహనం తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రభుత్వం వైద్యశాల సిబ్బందికి ఈపూరు యోహాన్ శవం అప్పగించడం జరిగిందన్నారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం యోహాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చరణ్‌తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో వేమూరు రూరల్ సీఐ నఫీజ్ బాషా, ఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబులు బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిటౌన్: క్వాంట మ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో సోమవారం అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ ఆధ్వర్యంలో ‘మెంటార్ మ్యాపింగ్– క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ బృందం ఏర్పాటు’ అంశంపై క్వాంటమ్, ఏఐ ఇన్నోవేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌కు రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 300 మందికి పైగా టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, కళాశాలల అధ్యాపకులు హాజరయ్యారు. పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ఏఐ కీలకంగా మారుతున్నందున పరిశోధనలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా వర్సిటీలో ఈ ఏడాది వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ కోర్సు ప్రారంభించినట్లు తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ...
అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, క్వాంటమ్ టెక్నా లజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్‌కుమార్, క్వాంటమ్ వ్యాలీ మిషన్ ప్రతినిధి తాడికొండ వెంకటస్వామి, క్వాంటమ్ ఇండియా–ఐబీఎం లీడ్ శేషరఘునాథన్, క్వాంటమ్ ఇండియా–టీసీఎస్ లీడ్ గ్రాడ్‌ఫ్రేమతాల్స్ పాల్గొన్నారు.
రిటైల్ ఎకై ్సజ్ టాక్స్‌ను సర్దుబాటు చేయాలి
గౌడ సంఘం వినతి
మంగళగిరి టౌన్: మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు వ్యాపారం నిర్వహించని రోజులకు ఎకై ్సజ్ శాఖకు చెల్లించిన ఆర్‌ఈటీ (రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్) మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లింపుల్లో సర్దుబాటు చేయాలని గౌడ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంగళగిరి ఆటోనగర్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్‌ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 2025లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని జిల్లాల్లో డ్రా ప్రక్రియ 35 రోజుల పాటు వాయిదా పడిందని పేర్కొన్నారు. లెసెన్స్ పొందిన దుకాణదారులు వ్యాపారం ప్రారంభించకముందే ఆ 35 రోజులకు సంబంధించిన ఆర్‌ఈటీని చెల్లించి ప్రొవిజనల్ లైసెన్స్‌లు పొందాల్సి వచ్చిందన్నారు. వ్యాపారం నిర్వహించని కాలానికి చెల్లించిన మొత్తాన్ని దుకాణదారులు ప్రస్తుతం ఎకై ్సజ్ శాఖకు చెల్లిస్తున్న వాయిదాల్లో సర్దుబాటు చేయాలని, లేదా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వారు కోరారు. దీనివల్ల దుకాణదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తుళ్లూరు శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్, దుగ్గిరాల మండల అధ్యక్షుడు జూపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


