చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్సలర్ పావులూరి సుబ్బారావుకు ప్రతిష్టాత్మకమైన ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ గౌరవం లభించింది. అంతరిక్ష రంగం, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ప్రదానం చేసింది. చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, సీఈఓ మేఘన, వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ అభినందనలు తెలిపారు. ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ గౌరవం అందుకున్న డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ, అంతరిక్ష, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు తాను అందిస్తున్న సేవలను గుర్తించి ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
దాడి కేసులో నిందితుడికి
ఏడేళ్ల జైలు
గుంటూరు రూరల్: కత్తులు, చేతులతో దాడిచేసి మనిషిని గాయపరిచిన సంఘటనలో నిందితుడికి ఏడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్స్ స్పెషన్ కోర్టు న్యాయమూర్తి టి.వి.రాజకుమార్ సోమవారం తీర్పు చెప్పారు. గోరంట్ల గ్రామానికి చెందిన పెండ్యాల సతీష్‌కుమార్‌పై అదే గ్రామానికి గోపినాధ్ కత్తి, చేతులతో దాడిచేసి విచక్షణా రహితంగా గాయపరిచాడు. సంఘటనపై 2022 ఆగస్టు 3న అప్పటి నల్లపాడు పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జత్యానాయక్ కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం నిందితుడికి ఏడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేనిచో 30 రోజులపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కోర్టులో నేరం రుజువు చేయడంతో కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారి అశోక్‌వాణి, పోలిసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
నిందితులకు
ఆరు నెలల జైలు
గుంటూరు లీగల్: గుంటూరు అమరావతి రోడ్డులోని ఇంటి ముందు నిలిపి ఉంచిన మోటార్ సైకిల్‌ను దొంగతనం చేసిన కేసులో నిందితులు ఇంజేపల్లి మేరిబాబు, యద్దనపూడి దీన భాస్కర్, బడుగు ప్రభుకుమార్‌లకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె.లత సోమవారం తీర్పు చెప్పారు. కేసు విచారణాధికారి ఓ.ఆరోగ్యరాజు, అరండల్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ ధర్మేంద్ర బాబుని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.ఆర్.పవన్‌కుమార్‌ని అధికారులు ప్రసంశించారు.
గుంటూరు రూరల్: సరదాగా ఈతకు వెళ్లి కాలువలో ఊపిరాడక విద్యార్థి మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ మొహిద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన పోలుదాసు ప్రభాస్ (24) ఆరవ మైలు సమీపంలోని ఇండియన్ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం కళాశాల అనంతరం తోటి స్నేహితులు పది మందితో కలిసి కళాశాల సమీపంలో కాలువలో ఈతకు వెళ్లారు. స్నేహితులు అందరూ కాలువ కట్టపై ఆడుకుంటుండగా ప్రభాస్ కాలువలోకి ఈతకోసం దూకాడు. ఎంతసేపటికి పైకిరాకపోవటంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేయగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రభాస్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లతో వెతికించి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


