బాపట్ల: ప్రభుత్వ ఉద్యోగులు తన కుటుంబ సభ్యులేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలందించి ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఉద్యోగ విరమణ చేస్తున్న 53 మంది ఉద్యోగులను సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లోని ఈటీసీ హాల్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగులను సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇకపై కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ఆసక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో లవన్న, డీఈవో శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్‌వో విజయమ్మ, మెప్మా పీడీ ఆనంద్ పాల్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేస్తున్న 53 మందికి
ఘన సన్మానం


