చీరాల రూరల్: వెట్టిచాకిరీతో ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడు ఆర్డీవో చొరవతో కార్మికశాఖ, షాడోస్ సంస్థ సహకారంతో విముక్తి పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. వేటపాలెంలో ఓ బాలుడు గొర్రెల కాపరిగా గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నాడని షాడోస్ సంస్థ నిర్వహకులు రాజా సాల్మన్ తెలిపారు. అయితే అతడు పడుతున్న కష్టాలను చూసిన సాల్మన్ అతడి కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్డీవోను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సోమవారం వేటపాలెంలో బాధిత బాలుడు పనిచేస్తున్న ప్రదేశానికి చీరాల కార్మికశాఖ అధికారి సుజాత, సాల్మన్, వేటపాలెం ఎస్సై జనార్దన్‌లు ఆర్డీవో నరసింహారావును తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ఆర్డీవో విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిరోజు ఈ పనులు చేయలేకపోతున్నానని కాళ్ల వాపులు వచ్చాయని, అనారోగ్యానికి గురయ్యానని ఆ బాలుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. చలించిన ఆర్డీవో బాలుడు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించి తక్షణమే అతడిని అక్కడ నుంచి విముక్తి చేస్తున్నట్లు విడుదల ధ్రువపత్రాన్ని అందజేశారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఆర్డీవో బాలునికి సూచించారు. బాలునికి ప్రభుత్వం నుంచి అందివచ్చే వివిధ పథకాలను గురించి వివరించారు. బాలునికి తక్షణమే ప్రభుత్వ పధకాలను అందజేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలునికి విముక్తి కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిన షాడోస్ నిర్వహకులు రాజా సాల్మన్‌ను ఆర్డీవో అభినందించారు.
బాలునికి విడుదల ధ్రువపత్రం అందజేసిన ఆర్డీవో నరసింహారావు


