కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు రూరల్: నగర పరిధిలోని శిల్పారామం – పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్‌లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.48 కోట్లతో సుమారు 4.25 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ. 2–3 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ క్రాసింగ్స్ వద్ద భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అదనపు కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కల్వర్టుకు సుమారు రూ.10 లక్షలు– రూ.15 లక్షల వరకు అదనపు వ్యయం అవుతుందని తెలిపారు. త్వరలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా పేరేచర్ల జంక్షన్ వరకు ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తయితే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా అమరావతికి మెరుగైన అనుసంధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అదనపు విస్తరణకు సుమారు రూ.15 కోట్లు– రూ.20 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. ఆమోదం లభించలేదన్నారు. డ్రైనేజ్ కవర్లు, సెంటర్ లైటింగ్ వంటి అదనపు సదుపాయాలకు కూడా మరన్ని నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు.


