పూర్తయిన ప్రమాద మృతుల అంత్యక్రియలు ఒకేరోజు ఏడుగురి ఖననంతో శోకసంద్రంగా వేలూరు
చిలకలూరిపేట(యడ్లపాడు): చిలకలూరి పేట మండలం వేలూరు గ్రామాన్ని శుక్రవారం విషాదం చుట్టుముట్టింది. ఎస్సీ కాలనీలోని నాలుగు వీధుల్లో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే. ఒక ఇంట్లో తల్లిదండ్రుల కోసం బిడ్డలు విలపిస్తుంటే.. మరోచోట అక్కచెల్లెళ్ల కోసం తమ్ముళ్ల రోదనలు. ఇంకో ఇంట్లో భార్యను కోల్పోయిన భర్త.. అత్తను కోల్పోయిన కోడలు..అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఇకరారని తెలిసి మనవళ్లు, మనవరాళ్లు గుండెలవిసేలా రోదించారు. తమ వారిని శాశ్వతంగా కోల్పోయిన ఆ కుటుంబాల వేదన చూపరులను కదిలించింది. ఈనెల 26న బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం కొండమంజులూరులో సమీప బంధువుల ఇంట్లో ఓ వేడుకకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై మార్టూరు వైపు నుంచి వస్తున్న ఆటో..కళామందిర్ సెంటర్ వైపు మళ్లుతుండగా విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఆటోలో 15 మంది ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. చిలకలూరిపేట ఆస్పత్రిలో ఒకరు..గుంటూరు జీజీహెచ్‌లో ఇద్దరు కన్నుమూశారు. ఒకే గ్రామం నుంచి ఒక్కసారిగా ఏడుగురిని మృత్యువు కబళించింది.
20 గంటల నిరీక్షణ..
ప్రమాదం జరిగిన మరుసటి రోజు గుంటూరులో పోస్టుమార్టం పూర్తయిన ఇద్దరి మృతదేహాలను చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అప్పటికే ఐదు పోస్టుమార్టం చేసిన మృతదేహాలు ఉన్నాయి. పంచనామా పూర్తయినా.. అంతిమ ప్రయాణానికి మాత్రం ఆలస్యమైంది. 20 గంటలకు పైగా మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రి శవాగారంలోనే ఉండిపోయాయి.
న్యాయం కోసం ఆందోళన..
ఆస్పత్రి వద్ద కొందరు బాధిత కొందరు బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తుండగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. మృతదేహాలను ఖననం చేసేందుకు ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. అందరూ కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహాన్ని ఒక్కో ఆటోలోకి ఎక్కించారు. వేడుకకు వెళ్లిన వారిని..విగతజీవులుగా వేలూరుకు తీసుకొచ్చారు. భౌతిక కాయాలను చూసేందుకు వచ్చిన నాయకులు, బంధువులతో వీధులు కిటకిటలాడాయి.
చివరిచూపు కోసం బారులు
మృతదేహాలు ఇళ్లకు చేరగానే రోదనలు మిన్నంటాయి. నాలుగు వీధుల్లోని ఏడు ఇళ్ల ముందు చివరి చూపు కోసం జనం బారులు తీరారు. ఒకేసారి ఏడు కుటుంబాల్లో విషాదం నిండడంతో.. ఎవరిని ఓదార్చాలో బంధుమిత్రులకే అర్థం కాలేదు. మృతదేహాలున్న ప్రతి ఇంటికీ దైవ సేవకులు చేరుకుని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని కన్నీటితో వేడుకున్నారు.
ఒకే రోజు ఏడుగురి ఖననం
విషాదం మధ్య అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. గ్రామంలోని ఎస్సీ శ్మశానవాటికలో ఏడు సమాధులు సిద్ధమయ్యాయి. ఒకరి కోసం కాదు..ఇద్దరి కోసం కాదు..ఒకేసారి ఏడుగురి కోసం. నిన్నటి వరకు ఒకరినొకరు పలకరించిన ఆ వీధుల్లో.. నేడు చివరి చూపు కోసం జనం వరుసలో నిలబడ్డారు. వేలూరు విషాదం ఏడు కుటుంబాలకే పరిమితం కాలేదు. గ్రామానికే శోకసంద్రంగా మారింది.


