పిట్టలవానిపాలెం(కర్లపాలెం): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు చెప్పారు. ఒకనెల– ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు ఆర్డీవో హరికుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి మొత్తం 23 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రజల వద్దకే వచ్చి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శేఖర్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాపట్లటౌన్: రోడ్డు ప్రమాధంలో ఇరువురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని కమ్మ కల్యాణ మండపం సమీపంలో జీబీసీరోడ్డుపై జరిగింది. బాపట్ల పట్టణం, గులాంహుస్సేన్ తోటకు చెందిన కాసాని యశ్వంత్ చీరాలవైపు నుంచి ద్విచక్రవాహనంపై బాపట్ల వస్తున్నారు. అదే సమయంలో బాపట్ల నుంచి వెదుళ్లపల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కాసాని యశ్వంత్‌తోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరువురిని ప్రథమ చికిత్స కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స
కోసం గుంటూరు, చీరాల తరలించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
చిలకలూరిపేట: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మాటలకు అందని మహావిషాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరులో అశ్రునయనాల మధ్య జరిగిన అంతిమ సంస్కారాలకు హాజరై మృతులకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున తక్షణ ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలు నిరుపేదలని, ప్రభుత్వం వెంటనే భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో ఫోన్‌లో ఈశ్వరయ్య కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ సైతం వేలూరులో మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ కార్యదర్శి ఎలికా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన దళిత మహిళా వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొన్న ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.


