నిరవధిక ఆందోళనకు తాత్కాలిక విరామం | - | Sakshi
Sakshi News home page

నిరవధిక ఆందోళనకు తాత్కాలిక విరామం

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

నిరవధిక ఆందోళనకు తాత్కాలిక విరామం హామీల అమలులో ప్రభుత్వం విఫలం

చిలకలూరిపేట(యడ్లపాడు): రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన నిరవధిక ఆందోళనకు శుక్రవారం తాత్కాలిక విరామం లభించింది. అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 26న అర్ధరాత్రి చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో యడ్లపాడు మండలం వేలూరుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం విధితమే. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ గురువారం పట్టణ ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రారంభమైన ఆందోళన.. ఎన్‌ఆర్‌టీ సెంటర్‌ హైవే కూడలికి చేరింది. బాధితులతో కలిసి నాయకులు అక్కడే బైఠాయించారు. సుమారు 20 గంటల పాటు చీకట్లో హైవేపైనే ఎమ్మార్పీఎస్‌ నాయకులు, బాధిత కుటుంబాలు ఆహారం సైతం తీసుకోకుండా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా.. వేగంగా పోస్టుమార్టం నిర్వహించినా ఏడు మృతదేహాలు శవాగారంలోనే ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, రెండెకరాల భూమి, ఇంటి స్థలం, పిల్లల విద్యకు చేయూత, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాలను ఖననం చేయమంటూ.. నిరసన వీడమంటూ పట్టుబట్టారు.

ఏడుసార్లు చర్చలు.. ఫలితం శూన్యం

ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సీఐలు, ఆర్డీఓ, డీఎస్పీ తదితరులు నాయకులతో ఏడుసార్లు చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా యంత్రాంగంతో మాట్లాడామని, కొంత పరిహారం ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. తెల్లవారుజామున నిరసనకారులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని నాయకులు ఆరోపించారు. అరెస్టులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

హామీ అమలు కాకుంటే మళ్లీ పోరు

బాధితుల అంత్యక్రియల కోసం శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించామని, తమ డిమాండ్లపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందిస్తున్నారని ఎమ్మార్పీస్‌ నాయకులు తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయకుంటే తిరిగి నిరవధిక ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్‌, జాతీయ మహిళా అధ్యక్షురాలు తబిత, మహిళా ప్రతినిధి కరుణ తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా గిరిజన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాల ఆదుకుంటామని చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. భూక్యా సూర్య నాయక్‌, కోయ శ్రీను, రాంబాబు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement