తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె | - | Sakshi
Sakshi News home page

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

బాపట్ల: కంటే కూతురినే కనాలి అనిపించేలా తండ్రి పట్ల ప్రేమ, బాధ్యతను చాటుకున్న కుమార్తె డా. ఎడ్ల సునీత నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. తండ్రి చివరి కోరిక మేరకు కుమార్తె స్వయంగా తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించడం బాపట్లలో పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఎడ్ల అచ్యుతరావు 30.06.2003న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన కుమార్తె డా. ఎడ్ల సునీత ప్రస్తుతం రీజినల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, మార్టేరులో సీనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు నుంచి బాపట్ల వ్యవసాయ కళాశాలకు బదిలీపై వచ్చిన డా. సునీత బాపట్లలోనే నివాసం ఉంటున్నారు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తండ్రి అచ్యుతరావు ఆలనా పాలనా, ఆరోగ్యం, అవసరాలు, మంచి చెడులను చూసుకుంటూ సునీత సేవలందించారు. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న సమయంలో కూడా తండ్రి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసేవారు. అచ్యుతరావు అనారోగ్యానికి గురైన సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు ఎడ్ల శ్రీనివాస్‌ సెలవుపై బాపట్లకు చేరుకుని తండ్రికి వైద్య సేవలు అందించారు. కుటుంబ సభ్యులు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, కుమార్తె సునీత తండ్రికి అందించిన నిరంతర సేవ ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో తన చివరి కోరికగా కుమార్తె సునీత చేత తలకొరివి పెట్టించుకోవాలని అచ్యుతరావు కోరినట్లు సమీప బంధువులు తెలిపారు. గురువారం అచ్యుతరావు మతి చెందడంతో శుక్రవారం బాపట్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో సునీత తండ్రి చివరి కోరికను నెరవేర్చారు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో పురుషులే అంత్యక్రియలు నిర్వహించే ఆనవాయితీ ఉన్నప్పటికీ, తండ్రి కోరికను గౌరవిస్తూ సునీత ముందుకు వచ్చి తలకొరివి పెట్టడం పలువురి ప్రశంసలు అందుకుంది. అందుబాటులో ఉన్న తన తమ్ముడి సమక్షంలో తండ్రి చివరి కోరికను నెరవేర్చిన సునీత నిర్ణయం అచ్యుతరావు ఆత్మకు శాంతి చేకూర్చేలా ఉందని బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా, కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమె భర్త అంగీకారం తెలిపి ప్రోత్సహించడం అభినందనీయమని బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యతలకు ఆడ – మగ అనే తేడా లేదని, తండ్రి చివరి కోరికను గౌరవించి సునీత చూపిన ఆప్యాయత నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement