సిలికా ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న జీడిమామిడి రైతుపై దాడి
చినగంజాం: సిలికా ఇసుకను అక్రమంగా తవ్వుతుండడంతో తమ భూములు దెబ్బతింటున్నాయని అడ్డుకున్న రైతుపై ఇసుకమాఫియా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బత్తిన వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. చినగంజాం మండలం మోటుపల్లి సర్వే నంబర్ 114, 115లో అనుమతులు లేకుండా కొందరు సిలికా ఇసుక తవ్వకాలు జరిపి, అక్రమంగా రవాణా చేస్తూ అడిగిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ భూముల్లో సాగుకు నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతు బత్తిన వెంకటసుబ్బారావు సిలికా తవ్వకాల వల్ల తన భూములకు నీరు అందక 30 ఏళ్లుగా పెంచుకున్న మామిడి, జీడిమామిడి చెట్లు ఎండిపోయాయని పోలీసులకు గురువారం సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను రైతు గురువారం రాత్రి అడ్డుకున్నాడు. ఇతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలుసుకున్న ఇసుక మాఫియా రైతుపై దాడికి పాల్పడింది. తీవ్రంగా గాయపరిచింది. తనపై దాడి చేసిన వారిలో గతంలో రౌడీషీట్లు ఉన్న వ్యక్తులు ఉన్నారని రైతు చెబుతున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును స్థానికులు 108 వాహనం ద్వారా చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 9న కూడా ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్న నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన తనను ఇసుకమాఫియా వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇసుక అక్రమాలపై ఆగస్టు పదిన తహసీల్దార్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశానని వివరించాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుంటూరు ఎడ్యుకేషన్: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ శుక్రవారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. కారు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనది కాకుండా, తిరిగి ఉపాధ్యాయుడిపై దాడి చేయడం కారు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందని, ఎవరు బాధ్యులనేది లేకుండాఉపాధ్యాయుడిపై భౌతిక దాడి చేయడం తగదని, తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సైతం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు పూర్తి సంఘీభావం తెలిపారు.


