బాధితులకు జీజీహెచ్‌లో చికిత్స
బయలుదేరిన గంటలోనే ఆనందం ఆవిరి
జె.పంగులూరు: అప్పటివరకు కొండమంజులూరు గ్రామంలోని బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకల్లో అందరూ ఆడిపాడారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సొంత ఊరు బయలు దేరిన గంటలోపే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఒక్కసారిగా కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రైవేట్ బస్సు రూపంలో వచ్చి ఏడుగురు మృత్యువాత పడడంతో కొండమంజులూరు విషాదంతో నిండిపోయింది. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన సందిపోగు నవమ్మ మనవరాలు మొదటి పుట్టినరోజు బుధవారం రాత్రి జరిగింది. ఈ వేడుకలకు ఏలూరులో ఉన్న నవమ్మ బంధువులు 11 మంది ఒకే ఆటోలో బుధవారం సాయంత్రం 4 గంటలకు వచ్చారు. అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. సాయంత్రం ప్రార్థన చేసుకుని పుట్టినరోజు జరుపుకొంటున్న పాపను ఆశీర్వదించారు. రాత్రి 10 గంటల సమయంలో భోజనం ముగించుకుని కొంత సమయం బంధువులతో గడిపారు. తిరిగి అదే ఆటోలో పయనమయ్యారు. బయలుదేరిన గంటలోపే వారికి ప్రమాదం జరిగిందని, చనిపోయారనే వార్త తెలియగానే కొండమంజులూరు దళిత కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన వారు ఇంతలోనే విగతజీవులుగా మారడంతో జీర్ణించుకోలేకపోయారు.
చిలకలూరిపేట టౌన్/ యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగుర్ని బలిగొంది. రోడ్డు దాటుతున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతులు వేలూరు ఎస్సీ కాలనీకి చెందినవారు. ఈ విషాదంతో కాలనీలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే వచ్చాయి. మరోవైపు బాధితులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో పోస్టుమార్టం వేగంగా జరిగినా చిలకలూరిపేటలోని మార్చురీలోనే మృతదేహాలు ఉంచారు.
ఆ ఇంటికి ఇక పెద్ద దిక్కెవరు?
బొంతా బాబూరావు, మణెమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు భాగ్యరాజుతోనే వారు ఉంటున్నారు. భాగ్యరాజు పట్టణంలో ఏఎంసీలో ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం వారిది. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్న వేళ.. విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుమారుడి వేదన వర్ణనాతీతం. నిన్నటి వరకు తనతో మాట్లాడిన అమ్మానాన్నలు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకేసారి ముగ్గురు దూరం..
75 ఏళ్ల లక్ష్మమ్మ కొన్నేళ్ల క్రితమే భర్త బసవయ్యను కోల్పోయింది. లక్ష్మమ్మకు ముగ్గురు సంతానం. అందరికీ వివాహాలు జరిగాయి. మొదటి కుమార్తె కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన సుబ్బులమ్మకు సంతానం కూడా లేకపోవడంతో ఒంటరిగా మిగిలింది. దీంతో తల్లి లక్ష్మమ్మను ఆశ్రయించింది. వీరిద్దరూ లక్ష్మమ్మ కుమారుడు ఏసు వద్దనే ఉంటున్నారు. లక్ష్మమ్మ రెండో కుమార్తె గంగమ్మ లారీ డ్రైవర్ అయిన భర్త నటరాజ్‌తో కలిసి అదే గ్రామంలో ఉంటోంది. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారికి కొండంత అండ. ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. లక్ష్మమ్మ.. గంగమ్మ.. ఏసు భార్య సువార్త.. ఒకేసారి మృత్యువాత పడ్డారు. ఆ ఇంట విషాదం మాటలకు అందడం లేదు. ఒకే రాత్రిలో మూడు బంధాలు తెగిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన చూసేవారి గుండెలను పిండేస్తోంది. నిన్నటి వరకు మనుషులతో కళకళలాడిన ఆ ఇల్లు.. ఇప్పుడు జ్ఞాపకాలతో, కన్నీళ్లతో నిండిపోయింది.
అనారోగ్యంతో ఉన్న భర్తకు భార్య దూరం..
బొంత సంపూర్ణమ్మ(70) భర్త పెద్ద ఏసు ఆర్మీ రిటైర్డ్ అధికారి. వీరికి కుమారుడు ధనరాజ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద ఏసును ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ధనరాజ్‌కు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భారంగా మారకూడదని పెన్షన్‌తోనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. ప్రమాదంలో సంపూర్ణమ్మ మృతి విషయం తెలిసి షాక్‌తో భర్త కుప్పకూలడంతో ఐసీయూలో చేర్చారు.
ఇల్లాలిని కోల్పోయి...
బొంతా మరియమ్మ, సుబ్బారావు దంపతులు తమ ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. అవివాహితుడైన చిట్టిబాబు తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. సుబ్బారావు వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలో భర్తకు భార్య దూరమైంది. చిట్టిబాబుకు తల్లి లేకపోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
చికిత్స పొందుతున్న చౌటుపల్లి ధనమ్మ, చౌటుపల్లి సుబ్బులు, బొంతా అరుణ్‌కుమార్, బొంతా అభిరామ్
గుంటూరు మెడికల్: ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. జీజీహెచ్‌లో చికిత్స కోసం తరలిస్తుండగా వేలూరు గ్రామానికి చెందిన టి. సువార్తమ్మ (55), ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ బొంత మరియమ్మ (47) కూడా ప్రాణాలు కోల్పోయారు. 12 ఏళ్ల బొంతాపల్లి, ఆరేళ్ల శ్యామూల్ కొద్దిపాటి గాయాలు కావడంతో చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. ఎస్.సుబ్బాయమ్మ (60)కు పొత్తికడుపు కింది భాగంలో గాయమై రక్తస్రావం కావడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తున్నారు. మరో బాధితుడు బొంతా అరుణ్‌కుమార్ (30)కు పక్కటెముకల్లో గాయాలు కావడంతో పీటీవీఎస్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు.


