మద్యం మత్తులో...
నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం ఇతర రాష్ట్రాల బస్సుల వినియోగం మద్యం మత్తులోనే డ్రైవర్లు కనిపించని రెండో డ్రైవర్ మొద్దు నిద్ర వీడని రవాణాశాఖ గాలిలో దీపంలా ప్రయాణికుల భద్రత చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని కోదాడలో జరిగిన ఘటన కళ్ల ముందు నుంచి తొలగకముందే.. చిలకలూరిపేటలో ఆటోను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అతి వేగం.. మద్యం మత్తులో వాహనాలు నడపటం, దూర ప్రాంతాలకు వెళ్తున్న బస్సుల్లో సైతం రెండో డ్రైవర్ లేకపోవటం.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు బలవుతున్నాయి. కాసులే పరమావధిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అటు టీడీపీ సర్కారు కూడా ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసింది.
పట్నంబజారు: కోదాడలో ప్రైవేట్ బస్సు డ్రైవరు అతివేగంతో వెళ్లి ప్రయాణికులను బలిగొన్నాడు. ఈ దుర్ఘటన జరిగి 24 గంటలు గడిచేలోపే.. చిలకలూరిపేటలో అతివేగంతో ప్రైవేట్ బస్సు వెళ్లి ఆటోను ఢీ కొంది. ఈ ఘటన చూపరులను సైతం గగుర్పాటు కలిగించింది. శుభకార్యానికి వెళ్లొస్తూ.. ఏడుగురు మంది మృతి చెందారు.
ఈ నెల 26వ తేదీ రాత్రి పట్టాభిపురంలోని ఇంటర్‌సీటీ స్మార్ట్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు ఫూటుగా మద్యం తాగి బస్సును ఇష్టానుసారంగా నడిపి పలువురు వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఆ బస్సును నిలువరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు చేరుకుని.. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి మద్యం తాగినట్లు నిర్ధారించారు. ఆ ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సే చిలకలూరిపేటలో ఆటోను ఢీకొట్టింది. దీని యజమానులు మాత్రం చైన్నెలో ఉంటారని ఇక్కడి కార్యాలయం సిబ్బంది తెలిపారు. కనీసం సరైన సమాధానం కూడా చెప్పకుండా ‘కేసు పెట్టుకోండి, పోండి అంటూ..’ వాహనదారులతో మాట్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలాంటి ఘటనలతో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ఎంత వరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిన రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
అంత దూరమూ ఒక డ్రైవర్‌తోనే ..
దూర ప్రాంత ప్రయాణాల్లో డ్రైవర్ అలసటే ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. డ్రైవింగ్ గంటలపై చట్టపరమైన పరిమితులు, విశ్రాంతి వంటి అంశాలను రవాణా సంస్థలు పాటించాల్సిన అవసరం ఉంది. మోటారు వాహనాల చట్టంలో డ్రైవర్ల పని గంటలను నియంత్రించేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆచరణలో ఒకే డ్రైవర్‌తో సుదీర్ఘ ప్రయాణాలు సాగుతున్నాయి. ప్రతి సుదూర మార్గానికి తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. సంబంధిత పర్మిట్, మార్గం, రాష్ట్ర నిబంధనలు, డ్రైవింగ్ గంటల పరిమితులకు అనుగుణంగా సిబ్బంది ఏర్పాట్లు ఉండాలి. ఈ అంశాన్ని రవాణా అధికారులు తనిఖీల్లో స్పష్టంగా పరిశీలించాలి. కానీ ఆ దిశగా చర్యలు శూన్యం.
స్పందించని యాజమాన్యాలు
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ట్రావెల్స్ సంస్థలు అంతర్ రాష్ట్ర మార్గాల్లో బస్సులు నడుపుతున్నాయి. కొన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒక ప్రాంతంలో ఉండగా... బస్సుల నిర్వహణ మరో ప్రాంతం నుంచి సాగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా డ్రైవర్, సిబ్బంది మాత్రమే కనిపిస్తారు. అసలు యజమానులు స్పందించడం కూడా మానేశారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు తనిఖీలు నిర్వహించడం ముఖ్యం. వాహనాల రికార్డులు, డ్రైవర్ల వివరాలు, ఫిట్‌నెస్, పర్మిట్లు, బీమా, మార్గ నిబంధనలు, వేగ నియంత్రణ, డ్రైవర్ పని గంటలు తదితర అంశాలపై రవాణా శాఖ పర్యవేక్షణ ఉండాలి. కానీ తనిఖీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
బస్సు నడిపే వ్యక్తి మద్యం తాగి ఉంటే అది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన కాదు.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్య. రాత్రి వేళల్లో బస్సులను తనిఖీ చేసే సమయంలో డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాలు, రాత్రి సమయాల్లో ప్రయాణించే సుదూర బస్సులపై ప్రత్యేక నిఘా అవసరం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చట్టపరంగా రవాణా వాహనం పబ్లిక్ ప్లేస్‌లో నడవాలంటే సంబంధిత పర్మిట్ ఉండాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం పబ్లిక్ వాహనాలకు పర్మిట్ ఉండాలి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యం వద్ద సరైన పర్మిట్ ఉందా? ఆ ప్రకారం వాహనం నడుస్తోందా? అంతర్ రాష్ట్ర ప్రయాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? పర్మిట్ షరతులు ఉల్లంఘిస్తున్నారా? వంటి అంశాలను ఆర్టీఏ అధికారులు నిరంతరం పరిశీలించాలి. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇకనైనా నిబంధనలను పక్కాగా అమలు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


