గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో వారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, ఎల్‌ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు కక్షిదారులు, పోలీసు, స్టేక్ హోల్డర్స్ సహకరించాలని కోరారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం లక్ష్మీ హయగ్రీవ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనములతో ఉదయం లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకం, అలంకరణ, వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు.
పట్నంబజారు: రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో ఉన్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కె.సీతారామిరెడ్డి చెప్పారు. గుంటూరు స్వర్ణభారతినగర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. సారథి.పరివాహన్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో 83 సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడికల్ సర్టిఫికెట్, గ్రీన్‌ట్యాక్స్, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు, డ్రైవింగ్ లైసెన్సు, తదితర పలు సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ చేసిన నేపథ్యంలో వారిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాహన డీలర్లు నంబరు ప్లేట్ల కేటాయింపులో తాత్సారం లేకుండా వెంటనే కస్టమర్లకు అందజేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 536.90 అడుగులకు చేరింది. ఇది 181.9292 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,926, ఎడమ కాలువకు 2,067, ఎస్‌ఎల్‌బీసీకి 2 వేల చొప్పున క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 10,933 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 10,933 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


