నెహ్రూనగర్: చిలకలూరిపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం ఉదయం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి బంధువులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రమాదానికి కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఫోర్ లైన్ రోడ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్


