నెహ్రూనగర్ గుంటూరు నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో 2017 – 25 వరకు జరిగిన అభివృద్ది పనులకు సంబంధించి టెండరింగ్ విషయంలో జరిగిన గోల్‌మాల్‌ను ‘సాక్షి’ పలు దఫాలుగా కథనాల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. దొంగ టెండర్లు, లెస్ టెండర్లు వేయించి కార్పొరేషన్ ఆదాయానికి రూ.కోట్లలో నష్టం జరిగేలా చేశారని ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆ కాలంలో 152 వర్కుల్లో అక్రమాలు జరిగాయని.. వాటికి సంబంధించిన టెండర్ ఫైళ్లను తీసుకువెళ్లి పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని డీఎస్పీ చెప్పారు.
అర్ధరాత్రి వరకు విచారణ
వాస్తవానికి 156 వర్కుల్లో టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తి స్తాయి విచారణ చేపట్టాలని ఇటీవల నగర కమిషనర్ మయూర్ అశోక్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ఏసీబీ అధికారులు సదరు 156 వర్కులకు సంబంధించిన వివరాలతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. ఈ విచారణ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది. దీంతోపాటు మంగళవారం రాత్రి 8 గంటల తనిఖీలు చేశారు. రెండు రోజులపాటు సాగిన విచారణలో గతంలో 156 పనులని పేర్కొన్నప్పటికీ, జాబితాలో 4 పనులు రెండుసార్లు నమోదవ్వడంతో మొత్తం పనుల సంఖ్య 152గా నిర్ధారించామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. పూర్తిస్థాయి నష్టాన్ని లెక్కించేందుకు రికార్డులను పరిశీలిస్తున్నారు.
టెండర్లే వేయకుండా పనులు
గుంటూరు నగరపాలక సంస్థలో అధికారులను అడ్డం పెట్టుకుని కొంతమంది కాంట్రాక్టర్లు ఫేక్ కాంట్రాక్టర్ ఐడీలు సృష్టించి వాటితోనే ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లో పాల్గొని పదుల సంఖ్యలో వర్కులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి కొన్ని బిల్లులు ఆగిపోయినా మరికొన్ని చెల్లించినట్లుగా గుర్తించారు. దీంతోపాటు 135 వర్కులకుపైగా పనులకు లెస్ టెండర్ల మాయాజాలం సృష్టించి కార్పొరేషన్‌కు రూ.కోట్లల్లో నష్టం కలిగించారని తేలింది. అంటే 20 శాతం లెస్ టెండర్ వేస్తే దానిని అధికారుల సహకారంతో కింది స్థాయి సిబ్బంది దానిని 2.0 గా మార్చి వర్క్ ఆర్డర్ ఇవ్వడంతోపాటు బిల్లులు కూడా చేసేశారు.
అధికారులకు తప్పని ఆందోళన
2017–25 సమయంలో పనిచేసిన ఇంజినీరింగ్ విభాగ అధికారులు (జేటీవో, ఏఈఈ, డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు), సుమారు 40 నుంచి 50 మంది వరకు కాంట్రాక్టర్ల పాత్రపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా స్వాధీనం చేసుకున్న కీలక ఫైళ్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఎవరి పేర్లు బయటకు వస్తాయో అని 2017–25 వరకు పనిచేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.


