గుంటూరు ఎడ్యుకేషన్ విద్యాహక్కు చట్టం రాక ముందే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారిని టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్‌లో వయోభారం రీత్యా కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సివచ్చిందని అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్‌లు మాట్లాడుతూ స్పెషల్ టెట్‌లో పాస్ మార్కులు 60గా ఉండాలని, ఆఫ్ లైన్‌లో పరీక్ష నిర్వహించాలని, స్కూల్ అసిస్టెంట్‌లు ఎవరి సబ్జెక్టుకు వారిని పరిమితం చేసేలా మార్పులు చేయాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం మాట్లాడుతూ కార్పొరేట్ల కోసం క్షణాలలో చట్టాలను మార్చే ప్రభుత్వాలు న్యాయమైన ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కలెక్టరేట్‌లో డీఆర్వో ఖాజావలీకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్, ఎన్. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


