చెరుకుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని పొన్నపల్లి ఎస్టీ కాలనీ మహిళలు పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన 15 ఎస్టీ కుటుంబాల సభ్యులు సోమవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగమోహన్‌కృష్ణ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. కూటమి పాలనలో కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే మేలు చేకూరిందని చెప్పారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీలో చేరిన ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షడు దుండి శ్రీనివాసరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు బక్కా సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


