ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


