నకిలీ ఓట్లు.. గెలుపు ఫీట్లు! | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఓట్లు.. గెలుపు ఫీట్లు!

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

నకిలీ ఓట్లు.. గెలుపు ఫీట్లు!

2014, 2019 ఎన్నికల సమయానికి భారీగా ఓట్లు చేర్చిన అధికార పార్టీ మూడో దఫా విజయానికి ఆ డమ్మీ ఓట్లే ప్రధాన కారణం? ఎన్నికల కమిషన్‌.. సర్‌ ప్రక్రియతో పర్చూరులో బహిర్గతమైన నిజాలు

సర్‌ ప్రక్రియ అనంతరం తగ్గిపోయిన 20 వేల ఓట్లు

పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ వరుసగా మూడు పర్యాయాలు విజయాలు సాధించడంలో రహస్యం ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన సర్‌ ప్రక్రియతో బయట పడింది. సర్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 19,531 ఓట్లు తొలగిపోయాయి. నియోజకవర్గ పరిధిలో ఒక్కసారిగా భారీగా ఓట్ల జాబితా నుంచి వేలల్లో ఓట్లు తొలగిపోవడంతో చర్చకు ది.

పక్కా ముందస్తు ప్రణాళికతోనే...

పర్చూరు నియోజకవర్గంలో 2009 ఎన్నికల సమయంలో కేవలం 1,69,332 మాత్రమే ఉన్న ఓటర్ల సంఖ్య 2024 ఎన్నికల సమయానికి 2,30,196 కి చేరింది. గడిచిన 15 సంవత్సరాల్లో సుమారు 60,864 మంది ఓటర్లు అనూహ్యంగా పెరిగిపోయారు. స్థానిక అధికారుల అండదండలతో నకిలీ ఓట్లను చేర్చుకోగలిగిన టీడీపీ మూడు పర్యాయాలు వరస విజయాలను సాధించగలిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ముందస్తు ప్రణాళికతోనే 2014 ఎన్నికల నాటికి భారీగా ఓట్లు చేర్పునకు పూనుకుంది. టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పక్కా ముందస్తు ప్లాన్‌తో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారుల సహకారంతో తమకు అనుకూలంగా ఓట్లను తేలికగా చేర్చుకోగలిగారు. తహసీల్దార్‌ లాగిన్‌ ద్వారా ఓట్లు చేర్చుకునే ప్రక్రియ అమల్లో ఉండటం వారికి బాగా కలిసొచ్చింది. మార్టూరు, ఇంకొల్లు మండలాల్లో కంప్యూటర్‌ సెంటర్‌ల ద్వారా ఓట్లు చేర్చడంతో 2009లో నియోజకవర్గంలో 1,69,332 గా ఉన్న ఓట్ల సంఖ్య 2014 ఎన్నికల నాటికి 2,14,943కు చేరింది. అప్పటి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఓట్ల చేర్పు గురించి అంతగా గమనించకపోవడంతో ఒక్కసారిగా ఓటర్ల సంఖ్య 45,611 అదనంగా పెరిగింది. 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థికి విజయం సాధ్యమైంది. 2019 ఎన్నికల నాటికి అదే ప్లాన్‌ అధికార పార్టీ అమలు చేయడంతో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య మరో 14,799కు పెరిగింది. డమ్మీ ఓటర్లు కలిపి మొత్తం సంఖ్య 2,29,742కు చేరింది. 2019లో టీడీపీ అభ్యర్థి రెండో పర్యాయం విజయానికి ఇదే కారణం అయింది. ఓట్ల చేర్పునకు సంబంధించి కంప్యూటర్‌ సెంటర్‌లపై విచారణ చేపట్టినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. అదనంగా చేర్చిన ఓట్లు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో సెటిల్‌ అయిన స్థానికులవని గుర్తించారు. ఇక్కడ కూడా తమ ఓట్లను నమోదు చేయించుకున్నారు. వారందరినీ అధికార పార్టీ ప్రత్యేకంగా ఇక్కడకు పిలిపించి మరీ కొత్తగా జాబితాలో చేర్చడమే భారీగా ఓట్ల పెరుగుదలకు కారణమైంది. అలా అదనంగా చేర్చిన డమ్మీ ఓట్లును తమ సొంత ఓట్లుగా భావించి ఓటు బ్యాంకుకు ఇబ్బంది లేకుండా చేసుకోవడంలో వారు సఫలమయ్యారు. మూడో పర్యాయం టీడీపీ అభ్యర్థి విజయానికి ఇదే కారణమైంది. ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్ల తరలింపునకు ఆయా రాష్ట్రాల నుంచి బస్సులు ఏర్పాటు చేసి మరీ ప్రణాళిక ప్రకారం వారికి స్థానికంగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వారి అవసరాలను తీర్చి పంపడం ప్రతి సారి ఎన్నికల సమయంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో బస్సు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి.

అడ్డుకట్ట వేసిన వైఎస్సార్‌ సీపీ

2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు నకిలీ ఓట్లు చేర్చారు. జాబితాలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందనే విషయాన్ని అప్పట్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంతగా పట్టించుకోలేదు. టీడీపీ వారి ఈ కుట్రలను వారు కట్టడి చేయలేక పోయారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సీపీ పర్చూరు ఇన్‌చార్జ్‌గా నియమితులైన నాయకుడు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ తప్పును గుర్తించి ఫారం 7 ద్వారా 25 వేల ఓట్లు అనర్హత కలిగినవిగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయడంతో సుమారు 14 వేల ఓట్లు తొలగించారు. టీడీపీ అదనపు ఓట్లు చేర్చే నాటకానికి దాంతో తెర పడింది. కేవలం 454 మంది మాత్రమే కచ్చితమైన ఓటర్లని గుర్తించి అధికారులు కొత్తగా జాబితాలో చేర్చగలిగారు.

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ ప్రక్రియతో పర్చూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓట్లు సుమారు 19,531 తొలగిపోయాయి. మరణాలు, వివాహం అయిన మహిళా ఓటర్లు, వలస ఓటర్లు, ఎక్కడ నివాసం ఉన్న వారు అక్కడే ఓటు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి అని పేర్కొంటూ సర్‌ ప్రక్రియ సాగడంతో గతంలో టీడీపీ అభ్యర్థులు చేర్చిన డమ్మీ ఓట్లు సుమారు 20 వేలు తొలగిపోయాయి. సర్‌ ప్రక్రియలో ఆబ్సెంట్‌, మరణాలు, డబుల్‌ ఎంట్రీ, వలస వెళ్లిన వారు ఓట్లు ఎక్కువగా తేలడంతో నియోజక వర్గంలో వాటిని డమ్మీ ఓట్లుగా గుర్తించారు. సర్‌ జరుగుతున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఓటర్లు వారికి సంబంధించిన ఆధారాలు స్థానికంగా ఉన్నట్లు చూపించడం, వివాహమై వెళ్లిన వారు, స్థానికంగా శాశ్వతంగా నివాసం ఉండని వారు, మరి కొన్ని డమ్మీ ఓట్లు అలానే ఉండిపోయాయి. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు సక్రమంగా అమలు చేస్తే మరో 15 వేల నుంచి 20 వేలు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement