సాక్షి ప్రతినిధి, గుంటూరు: వీఐపీ దర్శనాలు, సుప్రభాత సేవలకు అవకాశం ఇప్పిస్తామంటూ నకిలీ సిఫార్సు లేఖలతో భక్తులను కూటమి నేతలు నిండా ముంచేస్తున్నారు. దేవుళ్లంటే భయం కూడా లేకుండా వారు ధనార్జనే ధ్యేయంగా టీటీడీ లేఖలను సైతం అమ్ముకుంటున్న దుర్మార్గపు ఘటనలు జిల్లాలో అనేకం వెలుగుచూస్తున్నాయి. వీరిని పట్టుకుని దందా వెనుక ఉన్న ముఠాను అరెస్టు చేసి, అసలు సూత్రధారులను బయటకు లాగాల్సిన పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఏం చేసినా చూసీచూడనట్లు మిన్నకుండటం పోలీసులకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిదర్శనాలు ఇవీ...
● శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన 26 మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన పాపిశెట్టి శ్రీనివాసరావు అనే టీడీపీ నాయకుడు సేవా టిక్కెట్లతో పాటు రూములు కూడా సమకూరుస్తానంటూ సుమారు రూ.60 వేలు వసూలు చేశాడు. తీరా దర్శనం సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. గ్రామస్తులు సిఫార్సు లేఖలను టీటీడీ సిబ్బందికి చూపించగా, అవి నకిలీవని నిర్ధారించారు. దీంతో చేసేదేమీ లేక ఉచిత దర్శనం చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ ఎన్నారై నుంచి కూడా ఇతను రూ.26 వేలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్తులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. టీడీపీ నాయకుడు కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారని ఆరోపిస్తున్నారు.
● గుంటూరు నగరానికి చెందిన సుమారు 67 మంది మిర్చి వ్యాపారులు గత నెలలో తిరుమల వెళ్లి దర్శనం చేసుకునేందుకు సిఫార్సు లేఖల కోసం ప్రయత్నించారు. నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి టీటీడీ ఉద్యోగులతో విస్తృత పరిచయాలు ఉన్నాయని వారిని నమ్మించాడు. సుప్రభాత సేవ దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.4.22 లక్షలు కాజేశాడు. భక్తులు గత నెల 22న తిరుమల చేరుకున్నారు. సిఫార్సు లేఖలు పెడతానంటూ డబ్బులు తీసుకున్న నిమ్మల శ్రీనివాస్ కొద్దిసేపు మాట్లాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది. అతను ఇచ్చిన లేఖలను టీటీడీ అధికారులకు చూపించగా, అవి నకిలీవని తేలింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల సూచన మేరకు తిరుమల–2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడిని పట్టుకుని నకిలీ సిఫార్సు లేఖలపై లోతుగా దర్యాప్తు జరపకుండా వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాపారులంతా గుంటూరుకు చెందినవారు కావడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా... తిరుపతిలో ఇప్పటికే కేసు నమోదు అయినందున ఇక్కడ మరో కేసు పెట్టలేమని పోలీసులు తెలిపారు. నిందితుడు జనసేన నాయకుడు కావడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● గురజాల కేంద్రంగా టీడీపీ నేతల సిఫార్సు లేఖలు ఇప్పిస్తానంటూ భక్తుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న వైనం ఆలస్యంగా బయటపడింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని, దీని వెనుక టీడీపీ ముఖ్య నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ దందా వెనుక ఉన్న పెద్దల పాత్రను వెలికితీయలేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పలు మార్లు విమర్శలు గుప్పించినా ప్రభుత్వం నుంచి స్పందించకపోవడం గమనార్హం. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. కూటమి నేతలు తమ అక్రమ దందాకు దేవుళ్లను సైతం వాడుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వినుకొండ నియోజకవర్గంలోనూ టీటీడీ దర్శనాల పేరుతో టోకరా వేశారు.
టీటీడీ బ్రేక్ దర్శనాలు
కల్పిస్తామని టీడీపీ నేతల భారీ దోపిడీ


