రహదారి ప్రమాదాలను నియంత్రించాలి
బాపట్ల: భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మేరకు ముద్రించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాను జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ విడుదల చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్‌లో ఆమె విడుదల చేశారు. రాజకీయ పార్టీల నాయకులకు ఆమె సూచనలు చేశారు. ముద్రించిన ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీని రాజకీయపార్టీల నాయకులకు ఆమె అందజేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా సర్వే ముగిసిన తదుపరి జాబితాను ముద్రించామని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. తాజాగా ముద్రించిన ఓటర్ల జాబితాలో ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, వైఎస్సార్ సీపీ నాయకులు కోన రఘుపతి, బీజేపీ నాయకులు రామకృష్ణ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 9,40,389 మంది ఓటర్లు
బాపట్ల జిల్లాలో మొత్తం 9,40,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,59,138 మంది పురుషులు, 4,81,191 మంది మహిళలు, 60 మంది ఇతరులు ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో మొత్తం 1,78,450 మంది కాగా వీరిలో పురుషులు 86,737 మంది, మహిళలు 91,699 మంది, ఇతరులు 14 ఉన్నారు. రేపల్లెలో మొత్తం 2,01,475 మంది కాగా పురుషులు 98,884 మంది, మహిళలు 1,02,578 మంది, ఇతరులు 13మంది, బాపట్ల 1,71,430 మంది కాగా వీరిలో 83,466 మంది పురుషులు, మహిళలు 87,954 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు. పర్చూరులో 2,09,797 మంది కాగా 1,02,691మంది పురుషులు, 107101 మంది మహిళలు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. చీరాలలో 1,79,237 మంది ఉండగా వీరిలో 87,360 మంది పురుషులు, 91,859 మంది మహిళలు, 18మంది ఇతరులు ఉన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో నిలవాలి
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి, 2026 జులై 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులకు మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈటీసీ హాల్‌లో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి విజయమ్మ, పీడీ మెప్మా ఆనందం సత్యపాల్, పరిపాలనాధికారి మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణకు సమష్టి కృషి
గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని అన్నారు. పట్టణ, గ్రామాలు, విద్యాసంస్థలలోనూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గడచిన నెల రోజుల్లో 132 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామాలలో ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇప్పటికే ఈగల్ పల్లె పాట పేరుతో 445 మందిని చైతన్య పరిచామన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు వినియోగించడానికి అనుకూలత ప్రాంతాలుగా 50 ఉన్నట్లు గుర్తించామని, అక్కడ సీసీ కెమెరాలు అవసరం అన్నారు. డి అడిక్షన్ సెంటర్లో సమర్థంగా నిర్వహించాలన్నారు. 15 డ్రోన్ కెమెరాలతో డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహిస్తున్న తీరును పోలీసు అధికారులు వివరించారు. సమావేశంలో డీటీఓ పరంధామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని అధికారులు పాల్గొన్నారు.
బాపట్ల: రహదారి ప్రమాదాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ పేర్కొన్నారు. రహదారుల భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గడచిన ఆరు నెలల్లో 173 ప్రమాదాలు జరిగాయన్నారు. ఆ ప్రమాదాలలో 79 మంది మృతి చెందగా, 155 మంది క్షతగాత్రులయ్యారన్నారు. ప్రమాదాలన్నీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వేళల్లో జరుగుతున్నట్లు వివరించారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా రహదారుల వెంట మద్యం తాగుతున్న వారిపై 737 కేసులు నమోదయ్యాయన్నారు. 216 జాతీయ రహదారిపై 38 ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. 167–ఏ జాతీయ రహదారిపై 36 ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ అధికారులు నివేదించారు. 97 బ్లాక్ స్పాట్స్ వద్ద బారికేడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీటీఓ పరంధామరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సి వేణుగోపాల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీవోలు, ఎన్‌హెచ్‌ఏ అధికారులు, డీఎస్పీలు, కమిటీలోని ఆయా శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


