సమస్యల పరిష్కారానికి
బాపట్ల: ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం, స్థానిక అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు నెలకు రూ.3 వేల వేతనానికి పని చేయగలరా అని ప్రశ్నించారు. ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నెలకు స్వల్ప వేతనంతో ఎలా జీవిస్తారో పాలకులు ఆలోచించాలని అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు లేదా నాయకులు ఎవరైనా ఆ జీతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, యానిమేటర్ల ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) తదితర అధికారులు పని ఒత్తిడి పేరుతో కార్మికులను వేధించడం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. పనిభారం పెంచి భయభ్రాంతులకు గురిచేసే ధోరణిని సహించేది లేదని స్పష్టం చేశారు. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రతతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నెలకు రూ.26 వేల కనీస వేతనం ప్రకటిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా వద్దకు వచ్చిన డీఆర్‌వో గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, ఏవోడీ మల్లికార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. వసంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాబురావు, కోశాధికారి సీహెచ్. మణిలాల్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. ఝాన్సీ, పి. రేఖా ఎలిజబెత్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి. ధనలక్ష్మి, ఎం. వెంకటేశ్వరమ్మ, వీవోఏ జిల్లా నాయకులు కె. లక్ష్మి, జి.వి. ప్రసాద్, సీఐటీయూ జిల్లా నాయకులు కె. శరత్, పి. మనోజ్, ఎం. కిరణ్, శైలశ్రీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి. కృష్ణమోహన్, ఐద్వా జిల్లా కార్యదర్శి టి. సుభాషిణి, జి. సుధాకర్, జి. ప్రతాప్ కుమార్, ఆగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.


