వినుకొండ: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్, గుంటూరు డీఆర్‌ఎం. సుదేష్ణసేన్‌లు శుక్రవారం వినుకొండ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పార్కు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సిబ్బంది 16 క్వార్టర్ల సముదాయాన్ని జీఎం ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్‌కే రాజకుమార్, ఈఈ తపన్ కుమార్ సింహ, అధికారులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయల పరిధిలో ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంసీఏ, హార్టికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంసీఏలో 737 మంది పరీక్షలకు హాజరు కాగా, 724 మంది ... హార్టికల్చర్ కోర్సులో 16 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు.
నరసరావుపేట: జాతీయ రహదారి (ఎన్‌హెచ్–167ఏ)కి సంబంధించిన 58 మధ్యవర్తిత్వ కేసులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో విచారణ చేపట్టారు. పలువురు రైతులు భూసేకరణ, పరిహారానికి సంబంధించిన అంశాలపై తమ న్యాయవాదులతో వచ్చి సమస్యలు వినిపించారు. కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
కోర్టు భవనాల కోసం స్థల సేకరణ
రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారులు బాలకృష్ణ, మురళీకృష్ణ, గోపాలకృష్ణలతోపాటు తహసీల్దార్లతో వీసీ నిర్వహించారు. స్థల సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గుంటూరులీగల్: పిల్లలకు తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే మంచి క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పించాలని జువైనైల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ మైలాబత్తుల శోభారాణి సూచించారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు గురువారం గుంటూరు మహిళా ప్రాంగణంలో జువైనైల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో బాల బాలికలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి శోభారాణి మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపించాలన్నారు. వారి ఆలోచనలు, ప్రవర్తన, స్నేహాలు, విద్యాభ్యాసంపై తగిన పర్యవేక్షణ కలిగి ఉంటే వారు మంచి మార్గంలో ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలిపారు. సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం ప్రతినిధులు, జువైనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బాలల రక్షణ, హక్కులు, భవిష్యత్తు అభివృద్ధి, పునరావాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల బాలికల తల్లిదండ్రులు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేట: పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)గా చుక్కా రత్న మన్మోహన్ నియమితులయ్యారు. బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన్ను పల్నాడు జిల్లాకు డీఎంహెచ్‌ఓగా ఇన్‌చార్జిగా నియమిస్తూ శుక్రవారం ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. గత నాలుగేళ్ల నుంచి డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ బి.రవి పదవీ విరమణ చేయటంతో ఈ మేరకు నియామకం అవసరమైంది.


