జాగా కనిపిస్తే చాలు పాగా! ● రిసార్ట్‌ల పేరుతో జోరుగా రియల్ ఎస్టేట్
● అక్రమార్కులకు అధికారుల వత్తాసు
● ప్రభుత్వ భూములు, పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్న దుస్థితి వేటపాలెం: కనీస అనుమతులు కూడా తీసుకోకుండా పంట పొలాలను కొనుగోలు చేసి, వాటిని ఇష్టానుసారంగా ప్లాట్లుగా విభజించి ప్రజలకు విక్రయిస్తూ నిబంధనలకు పాతర వేస్తున్నారు. తీరా అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి జనం మోసపోతుండగా, ప్రభుత్వ ఆదాయానికి మాత్రం రూ. కోట్ల మేరకు గండి పడుతోంది. రెవెన్యూ అధికారులకు కాసులు ఇస్తే క్షణాల్లో భూ వినియోగ మార్పులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం అది నివాసయోగ్యమైన ప్రాంతమా? అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? అనే విషయాలను కూడా పరిశీలించడం లేదు. తీర ప్రాంతాల్లో వేస్తున్న మూడొంతులకుపైగా లేఅవుట్లు కనీస అనుమతులు కూడా లేకుండానే విక్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా రియల్టర్లు ఎగవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల వాడరేవు నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం వరకు వందల ఎకరాల వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎకరాన్ని రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు విక్రయిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బైపాస్ రోడ్డు నుంచి రామాపురం తీరం వరకు వెళ్లే రహదారికి ఇరువైపులా దాదాపు 70 ఎకరాల వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చేశారు. చీరాల – వేటపాలెం బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మరో 80 ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను కూడా లేఅవుట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.
రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం, కొత్తపేట, అక్కాయిపాలెం ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని క్రయవిక్రయాలు చేయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ, సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను కొద్దిరోజుల్లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందని కొనుగోలుదారులను నమ్మబలికి రియల్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అసైన్డ్, సీలింగ్ భూములు సైతం..
తీరంలో రిసార్ట్‌ల పేరిట రియల్ ఎస్టేట్ దందా సాగుతోంది. కొందరు అధికారులు
సహకరిస్తుండడంతో పంట, బీడు భూములు అనే తేడా లేకుండా ప్లాట్లు వేసి
అక్రమార్కులు రూ.కోట్లు దండుకుంటున్నారు. సొంత పోరంబోకు, అసైన్డ్, సీలింగ్ భూముల్లో సైతం సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తుండడం విశేషం. అడ్డుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం
మండలం రామాపురం నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం వరకు ఈ దందా సాగుతోంది.