బియ్యం ధరల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

బియ్యం ధరల నియంత్రణకు చర్యలు ● జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట ● రేపటి నుంచి జిల్లాలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ప్రారంభం బాపట్ల: మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడానికి ప్రభుత్వమే నేరుగా బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ట ప్రకటించారు. బియ్యం ధరల నియంత్రణపై రైస్‌ మిల్లుల యజమానులతో గురువారం స్థానిక జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆమె సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీన బాపట్ల, చీరాల, పర్చూరు, చెరుకుపల్లి, వేమూరు మండల కేంద్రాలలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ బియ్యం కిలో రూ.65 ఉందన్నారు. ఆ ధరను నియంత్రించడానికి రైస్‌ మిల్లర్ల ఆధ్వర్యంలో సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ బియ్యం కిలో ధర రూ.52కు, స్ట్రీమ్‌ రైస్‌ కిలో ధర రూ.52, ముడి బియ్యం కిలో ధర రూ.50 చొప్పున విక్రయించాలన్నారు. బియ్యం విక్రయ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక రైస్‌ కార్డుకు 26 కిలోలు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌ కార్డ్‌తోపాటు తప్పనిసరిగా ప్రజలు తమ ఆధార్‌ కార్డు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. మార్కెటింగ్‌ శాఖ ఏడీ రమేష్‌బాబు పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

బాపట్ల: మానవ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా షాడోస్‌, వెట్టి విమోచన కోయిలేషన్‌, సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌, మానవత స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలను జేసీ గురువారం ఆవిష్కరించారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధించిన నేపథ్యంలో గుడ్డ సంచులను స్వచ్ఛంద సంస్థలు తయారు చేయడం అభినందనీయమన్నారు. డీసీపీఓ పురుషోత్తం, షాడోస్‌ ఎ.రాజ సాల్మన్‌, డాక్టర్‌ ఐ.శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి, అలేఖ్య, పావని, గురజాల శ్రీనివాసరావు, వెంకట్రావు, డీబీఆర్సీ భగవాన్‌ దాసు, శ్రీలేఖ, డీవీఎంసీ సభ్యులు ప్రసాద్‌, రోజ్‌ ఎన్జీవో ప్రసాద్‌, పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే పరమావధిగా భావించాలి

బాపట్ల: రైతుల సంక్షేమమే పరమావధిగా భావించి అధికారులు పనిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ఠ తెలిపారు. రైతుల సంక్షేమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. అధిక లాభాలు వచ్చే పంటలవైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని 8 సంఘాలను నాబార్డు గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు. రైతు ఉత్పత్తి కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు ఇవ్వాలని, రైతుల వద్ద ధాన్యం నిల్వ చేసుకునే అవకాశాలు కల్పించాలి, ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని పలువురు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement