దేవుడి గుడిలోనూ రాజకీయమే.. | - | Sakshi
Sakshi News home page

దేవుడి గుడిలోనూ రాజకీయమే..

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

● ఓ వర్గం భక్తులకు తెరుచుకోని ఆలయ ద్వారం ● గుడికి తాళం వేసిన ఈవో, పూజారి

మార్టూరు: గ్రామంలోని వర్గ పోరుతో పూజల కోసం వచ్చిన ఓ వర్గానికి చెందిన భక్తులకు సహరించకుండా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎండోమెంట్‌ ఈఓ, ఆలయ పూజారి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన సంఘటన మండలంలోని డేగరమూడిలో బుధవారం రాత్రి జరిగింది. బాధిత భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని శివాలయంలో కల్యాణం జరుపుకోవడానికి బుధవారం ఉదయం ఆలయ పూజారి నరేష్‌ను సంప్రదించి సాయంత్రానికి పూజ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. కల్యాణం కోసం సాయంత్రం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ముఖద్వారం తాళం వేసి ఉండటం చూసి విస్తుపోయి పూజారి కోసం ప్రయత్నించగా అందుబాటులో లేడని తెలిసింది. ఎండోమెంట్‌ ఈవో కృపారావును సంప్రదించగా.. పూజారి విషయం తనకు తెలియదని కనుక్కుంటానని సమాచారం ఇచ్చి తర్వాత సమాధానం చెప్పలేదని భక్తులు చెప్పటం గమనార్హం. చేసేదేమీ లేక తగిన ఏర్పాట్లతో వచ్చిన భక్తులు మరొక పూజారిని పిలిపించుకొని ద్వారాలు మూసివేసిన ఆలయం వెలుపల కల్యాణం నిర్వహించుకుని వెళ్లిపోయారు. ఈ విషయమై పూజారి నరేష్‌ వివరణ కోసం విలేకరులు ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటం గమనార్హం. ఈవో కృపారావును వివరణ కోరగా గ్రామాల్లో పరిస్థితి మీకు తెలియనిది ఏముంది? దీనిని సహించేది లేదని, చర్యలు తప్పవని పూజారిని హెచ్చరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement