జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఆరు సంరక్షణ కేంద్రాలు
ఈ ఏడాది ఇప్పటి వరకు 17,776 గుడ్ల సేకరణ
390 తాబేళ్ల పిల్లలు
సముద్రంలోకి విడుదల
తాబేళ్ల సంరక్షణకు 12 మంది వలంటీర్ల నియామకం
వేటపాలెం: జిల్లాలో సముద్రపు తాబేళ్లు (ఆలీవ్ రిడ్ల్లే) సంరక్షణలో అటవీ శాఖ ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో బాపట్ల మండలం సూర్యలంక నుంచి చిన్నగంజాం మండలం పరిధిలోని ఏటిమొగ్గ వరకు 35 కిలో మీటర్లు సముద్ర తీరం వెంట సముద్ర తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో ఆరు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి పిల్లలుగా తయారు చేసిన తరువాత వాటిని సముద్రంలోకి విడిచి పెడుతుంటారు. వీటి సంరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 12 మంది వలంటీర్లను అటవీ శాఖ నియమించింది. వీటిపై పర్యవేక్షణకు ప్రాజెక్టు +కోఆర్డినేటర్‌ను నియమించారు.
సంరక్షణ కేంద్రాలు ఇక్కడే..
జిల్లాలోని సముద్ర తీర గ్రామాలైన సూర్యలకం, వేటపాలెం మండల రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామచంద్రాపురం, కుంకుడు చెట్లపాలెం, చిన్నగంజాం మండలం ఏటిమొగ్గ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలున్నాయి. జిల్లాలో ఉన్న సముద్ర తీరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 155 తల్లి తాబేళ్లు తీరానికి వచ్చి 17,779 గుడ్లు పెట్టి వెళ్లాయి. వీటిని వలంటీర్లు సేకరించి ఆరు సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం ఈ గుడ్లు తాలూకూ 390 పిల్లలుగా మారడంతో వాటిని సముంద్రంలోకి సురక్షితంగా వదిలేశారు. ఈ ప్రక్రియ మే వరకు కొనసాగుతుంటుంది.
తాబేళ్ల సంరక్షణ ఇలా...
ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు ప్రతి ఏడాదీ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు మాత్రమే ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. సముద్రం నుంచి రాత్రి వేళల్లో తాబేళ్లు ఒడ్డుకు చేరుకొని తీరానికి దగ్గరలో ఇసుకలో గుంటలు చేసుకొని గుడ్లు పెడుతుంటాయి. ఉదయాన్నే అటవీ శాఖ ఏర్పాటు చేసిన వలంటీర్లు తీరం వెంట వెళ్లి.. తల్లి తాబేళ్ల కాళ్లు ఆనవాళ్లను గుర్తించి అవి ఎక్కడ గుడ్లు పెట్టింది కనుగొంటారు. ఈ గుడ్లు సేకరించుకొని వెళ్లి సంరక్షణ కేంద్రంలో గుంటలు ఏర్పాటుచేసి అక్కడ పెడతారు. ఆ గుడ్లు 48 నుంచి 55 రోజుల్లో పిల్లలుగా మార్పు చెందుతాయి. ఈ పిల్లలను తిరిగి వలంటీర్లు ద్వారా సురక్షితంగా సమ్రుంలో వదిలిపెడతారు.
సంరక్షణ ముఖ్యోద్దేశం
సముద్రం తాబేళ్ల జాతి అంతరించి పోకుండా కాపాడుకోవడం కోసం తల్లి తాబేళ్లు తీరంలో పెట్టిన గుడ్లను ఇతర జంతువుల పట్టుకోకుండా కాపాడటం, తాబేలు పిల్లలు పక్షులు, గద్దల బారిన పడి మరణించకుండా కొంత మంది తాబేళ్ల గుడ్లను దొంగిలించి తీసుకెళ్లకుండా వీటిని సంరక్షించుకోవడానికి చర్యలు చేపట్టారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో 2016వ సంవత్సరం నుంచి సముద్ర తాబేళ్లు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో సంరక్షణకు వలంటీర్లను నియమించాం. ఇప్పటివరకు 390 తాబేళ్ల పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేశాం.
–సుమేష్ గౌరవ్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, వేటపాలెం


