భట్టిప్రోలు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. భట్టిప్రోలు మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే ఆనందబాబు, జిల్లా అధికారులు పాల్గొని సీఎం చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతు సంతోంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా 29 వేల మంది రైతులకు రూ. 15.75 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు. రైతులకు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డ్రోన్‌లు వంటి యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నామని, భూసార పరీక్షల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసే విధానాన్ని రికార్డు స్థాయిలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వరదలు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.


