ఆటోనగర్‌లోకి అనర్హులు | - | Sakshi
Sakshi News home page

ఆటోనగర్‌లోకి అనర్హులు

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

ఆటోనగర్‌లోకి అనర్హులు

న్యాయం జరగకుంటే పోరుబాట

గత 30 ఏళ్లుగా అనేక అవాంతరాలను దాటుకుని నిలిచిన చీరాల ఆటోనగర్‌ స్థలాలను అనర్హులకు కేటాయిస్తున్నారంటూ నిజమైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అర్హులకు ఆటోనగర్‌ స్థలాలు కేటాయించి ఆదుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

చీరాల రూరల్‌: చీరాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్లుగానే పట్టణంలో వాహనాలు రద్దీ కూడా పెరిగిపోయింది. దీనికి తగ్గట్లుగానే పట్టణంలో మెకానిక్‌, పంచర్‌, టింకరింగ్‌, ఎలక్ట్రిషియన్‌, వెల్డింగ్‌ షాపులు పెరిగిపోయాయి. 1995లో అప్పటి ప్రభుత్వం చీరాల రూరల్‌ ప్రాంతమైన ఈపురుపాలెం శివారులో ఆటోనగర్‌ నిర్మించాలని చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ రంగంలోకి దిగింది. ఈపురుపాలెం పంచాయతీకి చెందిన 10 ఎకరాలు కేటాయించింది. కార్మికులు ఎక్కువగా ఉండటం.. షాపులకు స్థలాలు చాలకపోవడంతో సాల్వేషన్‌ ఆర్మీకి చెందిన 30 ఎకరాలను తీసుకుని ఆటోనగర్‌కు కేటాయించింది.

యూనియన్‌గా కార్యకలాపాలు

పట్టణంలోని అనేకమంది మెకానిక్‌లు, టైర్లు, పంచర్‌షాపులు, లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలకు టింకరింగ్‌ చేసే మెకానిక్‌లు, గ్యాస్‌ వెల్డర్‌లు, ఎలక్ట్రీషియన్లు కలసి 400 మంది కార్మికులు ఆటోనగర్‌లో షాపుల కోసం ఏపీఐఐసీకి అర్జీలు పెట్టుకున్నారు. ఒక్కొక్కరూ కొంత మొత్తంలో వసూలు చేసుకుని ఏపీఐఐసీకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా రూ. 20 లక్షలు డీడీల రూపంలో చెల్లించారు. మరో 200 మంది కార్మికులు కూడా తమకు కూడా షాపులు కేటాయించాలంటూ ఆటోనగర్‌ యూనియన్‌లో సభ్యులుగా చేరారు. సాల్వేషన్‌ ఆర్మీకి చెందిన 30 ఎకరాల భూమి తమదంటూ, తాము సేద్యం చేసుకుని జీవపోపాధి పొందుతున్నామని అక్కడ నివాసముంటున్న కొందరు గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. తరువాత కాలంలో కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆటోనగర్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఆటోనగర్‌లో ఇసుకతో మెరక తోలించి తారు రోడ్లు, విద్యుత్‌ స్తంభాలను కూడా వేయించారు.

ఏపీఐఐసీ నిబంధనతో వెనకడుగు

కార్మికులకు షాపులు కేటాయించే సమయంలో ఏపీఐఐసీ ఒక నిబంధన అమల్లోకి తెచ్చింది. ఆ ప్రకారం కార్మికులు నిర్మించే షాపులను 20 ఏళ్ల వరకు కార్మికులకు అప్పగించమని, ఒక్కొక్క ప్లాటుకు గజానికి రూపాయి లెక్కన ఐదు సెంట్ల షాపునకు ప్రతినెలా క్రమం తప్పకుండా అద్దె చెల్లించాలనే నిబంధన పెట్టింది. దీంతో కార్మికులు వెనక్కు తగ్గారు. 2024లో ప్రభుత్వం కొత్త జీఓ విడుదల చేసిందని.. దాని ప్రకారం ఎవరైతే కార్మికులు వారికి కేటాయించిన స్థలంలో షెడ్లు వేసుకుని పనులు చేసుకుంటారో వారికే కేటాయించే విధంగా జీఓలోని సారాంశమని కార్మికులు చెబుతున్నారు.

అనర్హులకు కేటాయింపు

అనర్హులకు ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ ప్లాట్లలో షాపుల కోసం డీడీలు చెల్లించిన నిజమైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని యూనియన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. జీఓను సాకుగా చూపి ఏపీఐఐసీ అధికారులు గుంటూరు, బాపట్ల, విజయవాడ, వైజాగ్‌ వంటి ప్రాంతాలకు చెందిన ప్రైవేటు వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, బస్సు, లారీల ఓనర్లకు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కొక్కరికి ఆరు నుంచి 10 ప్లాట్లు వరకు విక్రయిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆటోనగర్‌గా ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ ఏరియాగా మార్పులు చేశామని అధికారులు చెబుతున్నారు.

ఆటోనగర్‌ స్థలాల కోసం అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని వినతిపత్రాలు అందించాం. న్యాయం జరగకుంటే చట్టపరంగా ముందుకు వెళతాం.

– బాబు మేసీ్త్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement