మంగళగిరి టౌన్ : మహిళా రక్షణ చట్టంపై మరింత అవగాహన పెంచాలని, వాటి దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రూపొందించిన మహిళా రక్షణ చట్టాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్నారు. అన్యాయానికి గురైన మహిళలు వెంటనే ఫిర్యాదు చేసేలా చట్టాలను తెలియజెప్పాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు సేవతోపాటు చట్టాలను గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు వివరించి చైతన్యపరచాలని కోరారు. మహిళా భద్రత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు.
తాడేపల్లి రూరల్ : ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారులు జి. శాంతకుమారి, డి. నాగేశ్వరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాడేపల్లి పరిధిలో రాష్ట్ర సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రవేశానికి 5 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలని, మార్చి 10వ తేదీ వరకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సీఎస్‌ఇ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. 25 శాతంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ పిల్లలకు 6 శాతం చొప్పున ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో నాంచారమ్మ తల్లి తిరునాళ్ల గురువారం వైభవంగా జరిగింది. రెండు రోజులుగా గ్రామంలోని మహిళలు, భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పరవశించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారి ఆలయం కళకళలాడింది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణ పరిసరాలలో భారీ విద్యుత్ ప్రభలను అలంకరించి అందర్నీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు.


