మూగబోయిన నాదస్వరం | - | Sakshi
Sakshi News home page

మూగబోయిన నాదస్వరం

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

పద్మశ్రీ షేక్‌ మహబూబ్‌ సుభాని కన్నుమూత భార్య, కుమారుడితో కలసి దేశ విదేశాల్లో నాదస్వర కచేరీలు చిలకలూరిపేటతో విడదీయరాని బంధం

చిలకలూరిపేట: దేశ విదేశాల్లో తన నాదస్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సుస్వరాలు మూగబోయాయి. చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం ఉన్న పద్మశ్రీ షేక్‌ మహబూబ్‌ సుభాని (71) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం నాదస్వర విద్వాంసులకు పుట్టినిల్లు. ఈ విద్వాంసుల కుటుంబానికి చెందిన షేక్‌ మహబూబ్‌ సుభాని పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం. పెరిగింది, నాదస్వర విద్య నేర్పించి చిలకలూరిపేట పట్టణంలోని ఆయన తాత నాదబ్రహ్మ, నాదస్వర గాన కళాప్రపూర్ణ బిరుదాంకితుడు షేక్‌ చినపీరు సాహెబ్‌ ఇంట. నాదస్వరంలో ఎందరినో విద్వాంసులుగా తీర్చిదిద్దిన చినపీరు సాహెబ్‌కు మగ సంతానం లేకపోవడంతో ఆయన అల్లుడు మీరాసాహెబ్‌ చిలకలూరిపేటలోని తన గురువు, మామగారైన పీరుసాహెబ్‌ ఇంటిలోనే ఉండటంతో సుభాని బాల్యం, నాద విద్యకు తొలి అడుగులు ఇక్కడే పడ్డాయి. అలాంటి మహబూబ్‌ సుభాని మరణ వార్త స్థానికులను ఎంతోగానోకలిచివేసింది.

సంగీత ప్రస్థానం...

దక్షిణభారత శైలి కర్ణాటక సంగీతంలో విశిష్ట స్థానం కలిగిన నాదస్వరం అత్యంత మంగళప్రదమైనది. దేవాలయాలు, మత, సామాజిక పరమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉండవలిసిన వాద్యం నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించే వాద్యం కూడా ఇదే. నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చిన ఘనత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నాదస్వర విద్వాంసులకు దక్కుతుంది. దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు. వారి సుమధుర నాదం ఎన్నో దేవాలయాల్లో సుప్రభాత సేవలకు ఆధ్యాత్మిక శోభ సంతరింపజేస్తుంది. ఈ వంశంలో ఎనిమిదో తరానికి చెందిన విద్వాంసులైన షేక్‌ మహబూబ్‌ సుభాని, షేక్‌ కాలేషాబీ దంపతులకు నాదస్వరమే సర్వస్వం. అలాంటి కళకు అంకితమైన ఈ నాద ద్వయానికి కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్‌ ఎనిమిదో తేదీన పద్మశ్రీ పురస్కారం అందజేసి గౌరవించింది.

బాల్యం నుంచి ....

ఏడేళ్ల వయస్సు నుంచే మహబూబ్‌ సుభాని ఆయన తండ్రి షేక్‌ మీరా సాహెబ్‌ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. అలాగే షేక్‌ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్‌ జాన్‌ సాహెబ్‌ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వారి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారద సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ కె. చంద్రమౌళి వద్ద కొంతకాలం నాదస్వరం అభ్యసించారు. అనంతరం గానకళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్‌ షేక్‌ చినమౌలానా సాహెబ్‌ వద్ద తంజావూర్‌ బాణీలో పదేళ్లపాటు శిక్షణ పొందారు. కాలం గడిచేకొద్దీ శాసీ్త్రయ సంగీతానికి ఆదరణ తగ్గటంతో శాసీ్త్రయ సంగీతానికి నేటికీ పెద్ద పీటవేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి ఎందరో కళాకారులు తరలివెళ్లిన తీరుగానే మహబూబ్‌ సుభాని, కాలేషాబీ దంపతులు వెళ్లారు. అక్కడ శ్రీరంగంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు షేక్‌ ఫిరోజ్‌బాబు కూడా సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మహబూబ్‌ సుభాని తన జీవిత కాలంలో ఇప్పటికే అబుదాబి, బ్రెజిల్‌, దుబాయ్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్‌ తదితర విదేశాలతోపాటు భారత దేశ వ్యాప్తంగా కచేరీలు చేసిన ఘనత దక్కించుకున్నారు. పద్మశ్రీతోపాటు మరెన్నో పురస్కారాలు తన జీవిత భాగస్వామి కాలేషాబి, కుమారుడు ఫిరోజ్‌బాబుతో కలసి దక్కించుకున్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement