ఘనంగా ప్రారంభమైన హోసన్నా 49వ గుడారాల పండుగలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన దైవజనులు అబ్రహాం, జాన్‌వెస్లీ, రమేష్ తదితరులు లక్షలాది విశ్వాసులతో నిండిన లేమల్లె దయాక్షేత్రం ప్రాంగణం
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక వేదికపై దైవజనులు ఆశీనులు కాగా స్తుతి గీతాలు వీనుల విందుగా ఆలపించారు. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రసంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ప్రభువైన క్రీస్తు ఏసు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు పునరుజ్జీవం కలగాని ప్రార్థిస్తున్నామన్నారు. దేవుడు ఒక్కమాట సెలవిస్తే మనజీవితాలలో అద్భుతాలు జరగుతాయని.. అందుకోసం నిరంతరం విశ్వాసులు దేవుని నామాన్ని స్తుతించాలన్నారు. దయాక్షేత్రంలో అడుగుపెట్టిన రోగులు, వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలగాలని క్రీస్తు ఏసును ప్రార్ధిద్దామన్నారు. ఈ నాలుగురోజుల పాటు జరిగే గుడారాల పండుగలో ప్రార్ధనాత్మతో ప్రతి క్షణం దేవుని స్తుతించాలన్నారు.


