చీరాల రూరల్: ౖరెలు ఢీకొనడంతో బాలిక దుర్మరణం చెందిన సంఘటన చినగంజాం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. చినగంజాం మున్నంవారిపాలేనికి చెందిన చంద్రశేఖర రెడ్డి కుమార్తె హేమ శివస్మృతి (16)తన నాయనమ్మ ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో దిగువలైన్‌లో రైలు పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో బాలిక రైలుబండిని గమనించకపోవడంతో ఒంగోలు వైపు నుంచి విజయవాడ వెళ్లే బిలాస్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలిక పుట్టకతోనే మానసిక దివ్యాంగురాలని ఎస్సై చెప్పారు.
స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు
తాడేపల్లి రూరల్: కృష్ణానది కనకదుర్గ వారధిపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళగిరి వెళుతున్న మంగళగిరి డిపో బస్సు 38 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈక్రమంలో కనకదుర్గ వారధి మధ్యలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక అద్దం పగలడంతో పాటు వెనుక సీట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అద్దాల ముక్కలు లోపల పడడంతో లారీ ఢీకొన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై ఆర్టీసీ డ్రైవర్ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ రెండో దశకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చా వేదిక ప్రతినిధి సలీం మాలిక్, సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెస్ విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జొన్నా శివశంకర్, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
మాదిపాడు(అచ్చంపేట): సత్తెమ్మతల్లి గుడి బోర్డు సభ్యుల నియామకంలో ఇస్తామన్న మూడు పోస్టులు తమకు ఇవ్వకుండా కేవలం ఒకరికి మాత్రమే అవకాశం కల్పించి, మిగిలిన మొత్తం టీడీపీ సభ్యులు తీసుకున్నారని, తమకు ఇస్తామన్న కోటా ఇవ్వకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని మాదిపాడు జనసేన కార్యకర్తలు గురువారం వీడియో ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ తొలుత అనుకున్నట్లు సత్తెమతల్లి గుడి బోర్డు మెంబర్లుగా జనసేన తరఫున ముగ్గురు పేర్లను సత్తెనపల్లి పార్టీ ఇన్‌చార్జి యర్రంసెట్టి రామకృష్ణ, మాదిపాడు గ్రామ అధ్యక్షుడు కన్నాశ్రీను, ఉపాధ్యక్షుడు వెంకట్రావుల ద్వారా ప్రతిపాదించినట్లు తెలిపారు. అయినప్పటీకీ ఒక్కరికే అవకాశం కల్పించి మిగతా ఇద్దరికీ ఇవ్వలేదన్నారు. అదీగాక ప్రతిపాదించిన వారి పేర్లు కూడా పెట్టలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న ముగ్గురు సభ్యులకు బోర్డులో అవకాశం కల్పించకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని హెచ్చరించారు.


