చీరాల రూరల్: ఎస్పీ ఉమామహేశ్వర్‌పై అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్న చుండూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, దళిత మహాసభ మాచవరపు జూలియన్‌లు డిమాండ్ చేశారు. బాలకోటిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలంటూ గురువారం వారు తమ అనుచరులతో కలిసి చీరాల ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో సీఐ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడారు. బాలకోటిరెడ్డిపై చుండూరు చుట్టు పక్కల పోలీసుస్టేషన్‌లలో అనేక కేసులు నమోదై ఉన్నాయని, అతనిపై రౌడీషీటు కూడా ఉందని తెలిపారు. సెటిల్‌మెంట్లు, దందాలు, కోడి పందేలు, పేకాట, ఇసుక వంటి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ చివరకు పోలీసులపైనే దాడులకు దిగడం వారిని బ్లాక్‌మెయిల్ చేసే విధంగా వీడియోలు పెట్టడం దారుణమన్నారు. వారిపై అవినీతి, అసత్య ఆరోపణలు చేయడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ పెద్దలు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అటువంటి సంఘ విద్రోహ శక్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమతా సైనిక్‌దళ్ అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు, చీరాల, బాపట్ల నాయకులు పులిపాటి బాబురావు, మల్లెల బుల్లిబాబు, దార్ల శాస్త్రి, దేవరపల్లి బాబురావు, పండ్లూరి వినోద్, గోసాల అశోక్ పాల్గొన్నారు.


