నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా గురువారం దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు, వాటికి అనుబంధంగా ఉన్న గోదాముల్లో తనిఖీలు నిర్వహించి నూనె నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ పరిమితికి మించి ఉన్న లూజు పామాయిల్‌ను గుర్తించి శాంపిళ్లను సేకరించామన్నారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా కొన్ని బ్రాండెడ్ ఆయిల్ ప్యాకెట్లను కూడా గుర్తించి వాటి నమూనాలు కూడా సేకరించామన్నారు. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ బరంపేటలోని వాహిని ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తనిఖీ చేపట్టామన్నారు. పెద్ద మొత్తంలో నిల్వ ఉన్న బ్రాండెడ్ ఆయిల్ నిల్వలను గుర్తించామన్నారు. కాగా అధికారుల దాడులతో యజమానులు కొన్ని ఆయిల్ మిల్లులకు తాళాలు వేసి వెళ్లటం గమనార్హం.


