విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్‌లో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సె రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్‌ఎఫ్) పనిచేస్తోందని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. గుంటూరు–పొన్నూరు రోడ్‌లోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం విద్యుత్ అదాలత్ జరిగింది. అదాలత్‌లో 20 మంది విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిలో 19 మంది సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు సీఆర్‌డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్‌ఎఫ్ పని చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఐదు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలిన వాటిని పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 12వ తేదీన జాతీయ సమ్మెలో భాగంగా మిర్చి యార్డులోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు నాయకులు తెలిపారు. దీనిలో భాగంగానే మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికకు మంగళవారం అన్ని సంఘాలు కలిపి సమ్మె నోటీస్ అందజేశాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ‘కార్మిక కోడ్‘ల పేరుతో ఇప్పటివరకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థ స్థానంలో ప్రైవేట్ మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తూ చట్టాలు మారుస్తున్నారని, దీంతో ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న రైతులు, కార్మికులు, ఉద్యోగులకు చివరకు చిన్న వ్యాపారస్తులకు కూడా నష్టమేనని తెలిపారు. పై సమస్యల పరిష్కారానికై గురువారం మిర్చి యార్డులో పనిచేసే అన్ని రకాల ముఠా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. 12వ తేదీన సమ్మె కారణంగా ఎలాంటి లావాదేవీలు జరగవు కాబట్టి రైతులు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో మిర్చి యార్డు ఎగుమతి, దిగుమతి, కాపలా ముఠా కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాస్, నాగ గౌడ్, వేమెన్స్ అసోసియేషన్ నాయకులు బాబు, కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందరావు తదితరులున్నారు.
చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయులైన రేషన్ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం


