ఉరి వేసుకొని వివాహిత మృతి
మాదల(ముప్పాళ్ళ): కుటుంబ కలహాల నేపధ్యంలో వ్యక్తి ఇంట్లోని దర్వాజాకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు దుర్గారావు(42) ఆరు నెలల క్రితం భార్యతో కలిసి విజయవాడ పనులకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మాదల వచ్చి ఉంటున్నాడు. సోమవారం విజయవాడ నుంచి భార్యను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడగా అక్కడ కూడా గొడవ పడి వెళ్లిపోయాడు. దీంతో భార్య తిరిగి విజయవాడ వెళ్లగా దుర్గారావు మాదలలోనే తన తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లి తెల్లవారుజామున లేచిచూడగా దుర్గారావు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట చేయగా దుర్గారావు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లోనే దర్వాజాకు ఉరిపోసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే దుర్గారావును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై దుర్గారావు సోదరుడు చెన్నకేశవరావు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.


