శరవేగంగా పర్యాటకాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా పర్యాటకాభివృద్ధి

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

శరవేగంగా పర్యాటకాభివృద్ధి

శరవేగంగా పర్యాటకాభివృద్ధి

శరవేగంగా పర్యాటకాభివృద్ధి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: స్వదేశీ దర్శన్‌ పర్యాటకం అభివృద్ధితో స్వర్ణ బాపట్లగా రూపుదిద్దుకోనుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. స్వదేశీ దర్శన్‌ పర్యాటక రంగం అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి హైబ్రిడ్‌ మోడ్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను కలెక్టర్‌ ఆదేశించారు. పర్యాటక రంగం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తే బాపట్ల అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. సూర్యలంక వద్ద ఏర్పాటు చేస్తున్న పనులు వేగం పుంజుకోవాలన్నారు. హౌస్‌ బోట్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధి పనులలో జాప్యం ఉండరాదన్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కు నిర్మాణం పది నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుత్తేదారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి ఈ ప్రాంతం కీలకం కానుందన్నారు. పనుల పురోగతిపై క్షుణ్నంగా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ డి.డి. గాలి దేముడు, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు, అనుబంధ శాఖల అధికారులు, గుత్తేదారులు, తదితరులు పాల్గొన్నారు.

‘దళిత ఉద్యమ చరిత్ర‘ క్యాలెండర్‌ ఆవిష్కరణ

దళిత ఉద్యమ చరిత్ర క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ బుధవారం ఆవిష్కరించారు. దళిత నాయకులు నీలం నాగేంద్రకుమార్‌ రూపొందించిన ఈ క్యాలెండర్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉద్యమాలతోపాటు గేయాలు, గాయాలతో కూడిన వారిని గుర్తు చేసేవిధంగా క్యాలెండర్‌ రూపొందించటం ఆకర్షణగా నిలిచిందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు.

సంక్షేమ వసతి గృహాల నిర్మాణం వేగవంతం చేయాలి

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, మరమ్మతు పనులను ఇంజినీర్లు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. వివిధ శాఖలలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, మరమ్మతు పనులపై ఇంజినీరింగ్‌ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వసతి గృహాలకు గోడలు, చిన్నచిన్న మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో మూడు ఆటిజం సెంటర్‌ ల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు కాగా అనేది పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. భవిత కేంద్రాలకు సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ కిచెన్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. చీరాల ప్రాంతీయ వైద్యశాల పక్కనే నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ మే నెల నాటికి పూర్తి చేయాలన్నారు. ఆయుష్‌ శాఖ ద్వారా చేపట్టిన వైద్యశాలల భవన నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్‌ ఎస్‌ విజయమ్మ, డీసీహెచ్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ పద్మావతి, పీఆర్‌ డీఈ రాజన్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగా అభివృద్ధి కొరకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఎన్‌హెచ్‌ఏ, ఆర్‌ అండ్‌ బీ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సంబంధితశాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ లో ఆయన సమావేశం నిర్వహించారు.

విద్యార్థులకు బహుమతులు అందజేత

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ బహుమతులు అందజేశారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయమ్మ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement