విధులకు మంగళం... ఇంటికే పరిమితం | - | Sakshi
Sakshi News home page

విధులకు మంగళం... ఇంటికే పరిమితం

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

విధుల

విధులకు మంగళం... ఇంటికే పరిమితం

కొల్లూరు పీహెచ్‌సీ వైద్యురాలి నిర్వాహకం డీడీఓ అధికారాలు గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం వైద్యురాలి తీరుతో వైద్యశాల సిబ్బందికి కష్టాలు దిగజారుతున్న పీహెచ్‌సీ ప్రతిష్ట సేవలు అందక రోగుల అవస్థలు

కొల్లూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో పలు అవార్డులు అందుకున్న కొల్లూరు పీహెచ్‌సీ ప్రతిష్ట వైద్యురాలి తీరు కారణంగా అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. వైద్యురాలు దోనేపూడి నుంచి డెప్యూటేషన్‌పై ఇటీవల కొల్లూరు పీహెచ్‌సీకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. కొద్దిరోజులుగా ఆమె విధులకు హాజరుకాకుండా ఇంటికే పరిమితమైంది. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో హాజరు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ విధులకు హాజరైనా సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఇన్‌చార్జి డీడీఓగా ఉన్న సమయంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండానే కమిటీ సభ్యుల సంతకాలు సేకరించి మమ అనిపించేదని చెబుతున్నారు. కొద్ది నెలల కిందట ఆమె స్థానంలో డీడీఓగా అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడిని నియమించారు. అయినప్పటికీ ఆమె డీడీఓ అధికారాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఆ వైద్యుడిపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ హాజరును డీడీఓ అనుమతించాల్చి ఉండగా, డీడీఓపై బెదిరింపులకు దిగుతూ హాజరు అనుమతి అథారిటీని తన వద్దే ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. విధులకు హాజరుకాకున్నా తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి సైతం అటెండెన్స్‌ వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి తనకు అండదండలు ఉన్నాయంటూ సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సమాచారం. హాజరు పట్టికలో జనవరి 22న సీఎల్‌గా (క్యాజువల్‌ లీవ్‌) చూపిన ఆమె అదే నెల 29 వరకు వైద్యశాలకు వచ్చిన పాపాన పోలేదు. కానీ 29న వైద్యశాలకు వచ్చిన ఆమె 22న ఉన్న సీఎల్‌ను సైతం తన సంతకంలో కలిపేసుకొని ఏకంగా 8 రోజుల సంతకాలు ఒకే రోజు చేసినట్లు సమాచారం. ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిపింది’ అనే చందంగా సిబ్బందిలో ఒకరిద్దరు ఏఎన్‌ఎంలను సైతం తన ఇంటికి పిలిపించుకొని వారితో కాలక్షేపం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యురాలి తీరు కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులు మెరుగైన సేవలు అందక అవస్థలు పడుతున్నారు.

విధులకు మంగళం... ఇంటికే పరిమితం 1
1/1

విధులకు మంగళం... ఇంటికే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement