శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థికి జాతీయస్థాయి అవార్డ
కొల్లూరు: కదలిక శక్తి వృథా కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసి దానిని సద్వినియోగం చేసుకునే విధానంపై ప్రాజెక్టు ప్రదర్శించిన శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థి జాతీయ స్థాయిలో మెరసి అవార్డును కై వసం చేసుకున్నాడు. ఆదివారం బెంగళూరు యునైటెడ్ మిషన్ హైస్కూల్‌లో టేన్ 90 సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన వినూత్న పరిశీలనాత్మక ప్రాజెక్టుల జాతీయస్థాయి ఎస్‌పీఏఆర్‌సీ పోటీలలో మండలంలోని శ్రీరామ సైనిక్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి పిల్లా నాగచైతన్య మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటాడు. కదిలే టూగు టుయ్యాల అనే వినూత్న ప్రాజెక్టుతో దేశ వ్యాప్తంగా సమర్పించిన వెయ్యి ప్రాజెక్టులలో 30 ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా వాటిలో నాగచైతన్య ప్రాజెక్టు ప్రదర్శనకు స్థానం దక్కింది. ఈ ప్రదర్వనలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన నాగచైతన్యకు నగదు బహుమతిగా రూ.5 వేలు నగదు, రూ.20 వేలు విలువైన గిప్ట్ ఓచర్, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. విద్యార్థికి మార్గదర్శకత్వం అందించిన అయితిరెడ్డి సురేష్, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. భవిష్యత్‌లో నాగ చైతన్య మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని శ్రీరామ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.శ్రీకాంత్, డైరెక్టర్ కొలసాని తులసివిష్ణుప్రసాద్ ఆకాంక్షించారు.


