బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: సమస్యలను చెప్పుకునేందుకు స్టేషన్‌కు చేరుకునే బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 62 మంది అర్జీలు అందించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కోరారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్‌నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ మహిళా ఎస్‌ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.


