అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
వేటపాలెం: అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం పాత కూరగాయల మార్కెట్ నుంచి పద్మశాలి వీధికి వెళ్లే రోడ్డు పక్కన చోటుచేసుకుంది. వన్‌వే రోడ్డు దగ్గరలో జెండా చెట్టు వద్ద నివాసం ఉంటున్న ఆత్మకూరి మధు(48) పెయింటింగ్ మేసీ్త్రగా పనిచేస్తుంటాడు. అతనికి రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. నాలుగు రోజుల కింద భార్య బంధువుల ఊరెళ్లింది. అప్పటి నుంచి నిత్యం రోజంతా మద్యం తాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం మద్యం తాగి పడిపోయి ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి మధు చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ జనార్దన్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


