రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్య పాత్ర పోషించాలి
టి.కె.పరంధామరెడ్డి
బాపట్ల: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్జీవోలు ప్రముఖ పాత్ర పోషించాలని జిల్లా రవాణాశాఖ అధికారి టి.కె.పరంధామరెడ్డి పేర్కొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా శుక్రవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఎన్జీవోలు, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. పరంధామరెడ్డి మాట్లాడుతూ 2004వ సంవత్సరం మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వలన 8,346 మంది ప్రాణాలు కోల్పోయారని, 19,894 మంది క్షతగాత్రులయ్యారని సగటున రోజుకి 23 మంది చొప్పున మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రజలలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, తద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తాము నిర్వహించే కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.ప్రసన్న కుమారి, బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి. నిరంజన్‌బాబు, ఎన్‌జీఓ రాజా సల్మాన్, సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ.నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.


