అద్దంకికి ఎలక్ట్రిక్ బస్సులు
అద్దంకి: త్వరలో రాష్ట్రానికి 1500 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్‌ఎం జి. సత్యనారాయణ తెలిపారు. వాటిలో అద్దంకికి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం అద్దంకి డిపోను సందర్శించారు. ఆర్‌ఎం మాట్లాడుతూ ఎక్కువ అవసరం ఉన్న డిపోలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఆ బస్సులను కేటాయిస్‌త్రాని చెప్పారు. కోవిడ్ సమయంలో తీసేసిన రూట్లు, ఆటోల వల్ల దెబ్బతిన్న రూట్లలో మరలా బస్సులను తిప్పే అవకాశం ఉందన్నారు. ఉన్న బస్సులను సకాలంలో నడపడటం, గ్యారేజ్ మీద దృష్టి పెడతామని చెప్పారు. ఆయన వెంట డీఎం రామమోహనరావు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
చీరాల: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కారంచేడు మండలం జరుబులవారిపాలేనికి చెందిన బొనిగల ఆదిలక్ష్మి (58) అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం చీరాలలో ఉంటున్న మనవరాలి వద్దకు వచ్చింది. పొన్నూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ప్లాట్‌ఫాంపైకి వచ్చే క్రమంలో బస్సు తగలడంతో కిందపడగా బస్సు వెనుక చక్రాలు తలపైకి ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేవులోపడి మత్స్యకారుడు గల్లంతు
నిజాంపట్నం: సముద్రంలో వేటకు వెళ్లే నేపథ్యంలో తన పడవకు ఉన్న ఫ్యాన్‌ను పరిశీలించేందుకు నీటిలో దిగి వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని నిజాంపట్నం హార్బర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నిజాంపట్నంకు చెందిన పీతా పానకాలు(49) ఎప్పటి మాదిరిగా వేటకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం పడవతో సమాయత్తమయ్యాడు. ఈ నేపథ్యంలో పడవను పర్యవేక్షించుకునే నేపథ్యంలో పడవ కింద అమర్చే ఫ్యాన్ రెక్కలను పరిశీలించేందుకు రేవులోకి దిగాడు. రెక్కలను సరిచేస్తుండగా పానకాలు ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో రేవులో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిజాంపట్నం ఎస్‌ఐ బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మద్యం మత్తులో నడిరోడ్డుపై బైక్‌కు నిప్పు
కారెంపూడి: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బైక్‌ను నడిరోడ్డుపై తగలబెట్టిన ఘటన కారెంపూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకుడు చిన పీర్లసావిడి వద్ద బైక్‌ను ఆపి దానికి నిప్పు పెట్టాడు. సాయంత్రం పాఠశాలలు విడిచిపెట్టే సమ యం కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున నడిరోడ్డుపై మంటలు చెలరేగడంతో వాహనాదారులు ఇబ్బందులుపడ్డారు.
రేపు మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
గుంటూరు మెడికల్: బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం సెంటర్‌లో ఈనెల 4వ తేదీన ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విచ్చేసి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మంత్రులు, కూటమి నేతలు పాల్గొంటా రని వెల్లడించారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులుబజరంగ్ రామకృష్ణ పాల్గొన్నారు.
అద్దంకికి ఎలక్ట్రిక్ బస్సులు
అద్దంకికి ఎలక్ట్రిక్ బస్సులు


