రైతు కష్టం...అడవి ఆవుల పాలు
రాత్రికి రాత్రే నాశనం చేశాయి..
బాపట్ల: ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే తరుణంలో అడవి ఆవులు వరికుప్పలపై పడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రికి రాత్రే అడవిలో నుంచి వరి పొలాల్లోకి వచ్చి కుప్పలు వేసిన వరి పంటను తింటూ నాశనం చేస్తున్నాయి. ఆవుల బారి నుంచి కుప్పలను కాపాడుకోవడం ఆయా ప్రాంతాల్లోని రైతులకు కష్టతరంగా మారింది. అడవిలో నుంచి సుమారు 20 నుంచి 50 ఆవుల వరకు వచ్చి కుప్పలపై పడుతున్నాయి. కుప్పల్లోని గడ్డిమొత్తాన్ని దూసి ధాన్యం తినడంతోపాటు కుప్పలను కాళ్ళతో తొక్కుతు నాశనం చేస్తున్నాయి. దీంతో ఆవుల పడిన కుప్పల వద్ద రైతులు వెళ్ళి చూస్తే మూడు బస్తాల వరకు ధాన్యం భూమి పాలు అవుతుంది. మరో రెండు బస్తాల మేర ధాన్యాన్ని ఆవులు తిని తిరిగి అడవికి వెళ్తున్నాయి. దీంతో వాటిని అరికట్టడం రైతులకు పెనుసవాల్‌గా మారింది.
బాపట్ల, కర్లపాలెం మండలాల్లో ఫారెస్ట్ భూమి అధికంగా ఉండటం వల్ల తీరప్రాంత గ్రామాల్లోని ఆవులు అడవిలో ఉంటూ రాత్రికి రాత్రే పొలాల్లోకి వచ్చి పొలాలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని తీరప్రాంత గ్రామాలైన బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం, పిన్నిబోయినవారిపాలెం, కొత్తమద్దిబోయినవారిపాలెం, మద్దిబోయినవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, పాండురంగాపురం, అసోదివారిపాలెం గ్రామలతోపాటు కర్లపాలెం మండలంలోని పేరలి, తుమ్మలపల్లి, సమ్మెటవారిపాలెం, శీలంవారిపాలెం, కప్పలవారిపాలెం గ్రామాల్లోని రైతుల పొలాలను ఆవులు నాశనం చేస్తున్నాయి. వీటికోసం రైతులు రేయింబవళ్ళు పొలాలకు కాపలా కాసుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు అయితే ఆవుల బారినుంచి కుప్పలను కాపాడుకునేందుకు కుప్పలకు పరదా పట్టలు, ముళ్ళ కంచెలను వలయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
నేను నాలుగు ఎకరాలు సాగు చేసుకున్నాను. నాటు మొక్క వేసినప్పటి నుంచి పొలానికి కాపలా కాసుకుంటూనే ఉన్నాను. పైరు పొట్టదశలో ఒక్కసారి అడవి ఆవులు చేలో పడి తిన్నాయి. మళ్లీ ఎరువులు, పురుగు మందులు వేసుకొని పైరును కాపాడుకున్నాను. ప్రస్తుతం వరికుప్పపై పడి నాశనం చేశాయి. సుమారు ఐదు బస్తాల మేర ధాన్యం నష్ట పోయాను.
– దండుప్రోలు సూర్యనారాయణ, రైతు
రైతు కష్టం...అడవి ఆవుల పాలు


