చీరాలలో ఎనీటైమ్ లిక్కర్
సమయపాలన లేకుండా టీ దుకాణాల కంటే దారుణంగా మద్యం విక్రయాలు మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి ఆర్డీఓకు వైఎస్సార్ సీపీ నేతల వినతిపత్రం
చీరాల: చీరాల్లో ఎనీటైమ్ లిక్కర్ అందుబాటులో ఉంటోంది. పేరుకే సమయపాలన పాటిస్తున్నామని చెబుతూ దొడ్డిదారిన మద్యం యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి అదనంగా సమయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తే రెండు రోజులు ముందుగానే రాత్రి వేళల్లో మద్యం అందుబాటులోకి కొందరు వైన్ షాపుల నిర్వాహకులు తెస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ టి. చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో విఠల్‌నగర్‌కు చెందిన పాలేటి భూపతి రావు కృష్ణా వైన్స్‌లో మద్యం తాగుతూ మరణించాడని తెలిపారు. పాత భవాని థియేటర్ పక్కన గల కృష్ణా వైన్స్‌లో మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. వీటిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆర్డీఓకు వినతిపత్రం అందించిన వారిలో పార్టీ బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసి మళ్ళ వాసు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, ఎస్.నవీన్, కంచర్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


