మునగ పంట ద్వారా వ్యాపార అవకాశాలు
బాపట్ల: ఆధునిక రైతాంగం వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలో కూడా ఎదగాలని, ఆరుగాలం కష్టించి పనిచేసే రైతు ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే వ్యాపారవేత్తగా రాణించడానికి ప్రస్తుతం అనేక అవకాశాలున్నాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలో మునగ పంట ద్వారా వ్యాపార అవకాశాలు అనే ప్రాజెక్టులో భాగంగా ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ఉచిత రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మునగ పంటను కుటీర పరిశ్రమగా స్థాపిస్తే అది రైతుకు లాభసాటి వ్యాపారమవుతుందని చెప్పారు. ఉద్యాన విభాగాధిపతి డాక్టర్ వి.శ్రీలత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మునగ పంట ప్రాముఖ్యతను, మునగలోని పోషక విలువలను వివరించారు. విస్తరణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.ప్రశాంత కుమార్ మునగ విలువ ఆధారిత ఉత్పత్తులు, మునగను సులువుగా మార్కెటింగ్ చేసుకునే విధానాలను వివరించారు. డాక్టర్ ఎన్.రత్నకుమారి మునగ సాగులో పురుగులు, తెగుళ్ల నివారణ పద్ధతులతోపాటు రోజువారీ ఆహారంలో మునగ ప్రాముఖ్యత గురించి తెలిపారు. మునగ ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి చేయడం ద్వారా ఆర్థికంగా బలపడుతున్న పరిశ్రమల వివరాలను రైతులకు వివరించారు. డాక్టర్ ఎం.లక్ష్మీమాధురి, డాక్టర్ జి.స్నేహలీల మునగ సాగులో మెలకువలు, మునగ ఉపయోగాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి వివరించారు. ఐసీఏఆర్ ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.


