పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలమేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమన్వయంతో పాన్ ఇండియా పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యత, సమాజ రక్షణ కొరకు చొరవపై మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని భద్రంగా ఉంచుదాం – రేపటిని రక్షిద్దాం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. పర్యావరణ క్షీణత, గాలి, నీటి కాలుష్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ –21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన హక్కు కల్పించిందన్నారు. నీటి ప్రాముఖ్యత మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమన్నారు. పట్టణాల్లో గాలి, నీటి కాలుష్యం ఎక్కువగా ఉందన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నీటి వినియోగం, కాలుష్య నివారణకు చేయవలసిన సలహాలు, సూచనలను చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతిభ చూపిన ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్ బహుమతులు అందజేశారు. ఏపీ పొల్యూషన్ బోర్డు నుంచి నజీనా బేగం, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ అనిల్, ప్యానెల్ అడ్వకేట్, మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ, భారతి సోప్స్ (త్రిపుల్‌ఎక్స్) వర్కర్స్, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్స్, విద్యార్థులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం స్టాఫ్, డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది పాల్గొన్నారు.


