యాప్‌తో పారదర్శంగా లెక్కలు
‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌పై గ్రామ సంఘ సహాయకులకు శిక్షణ
ఇంకొల్లు(చినగంజాం): గ్రామ పొదుపు సంఘాల సభ్యులు ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌ను వినియోగించుకొని సంఘాల్ని సమర్థంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా సంస్థాగత నిర్మాణ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కాకి రవికుమార్ తెలిపారు. మండల వెలుగు కార్యాలయంలో సోమవారం పర్చూరు, కారంచేడు మండలాల గ్రామ సంఘ సహాయకులకు యాప్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘాల సభ్యులకు, సభ్యురాళ్లకు పొదుపు, అప్పు వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా చూసుకునే సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా సంఘాల్లో జరిగే చిన్న తప్పిదాల్ని అరికట్టవచ్చని తెలిపారు. సంఘం, సభ్యుల లెక్కలు పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీ ప్రకారం గ్రామ సంఘ సహాయకులు లెక్కలను మొబైల్ ద్వారా ఆన్‌లైన్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లా బ్యాంక్ లింకేజ్ డీపీఎం అనంత లక్ష్మణాచారి మాట్లాడుతూ తీసుకున్న అప్పు మొత్తాన్ని జీవనోపాధులకే వినియోగించుకోవాలని, తద్వారా కుటుంబాల ఆర్థికస్థితి పెరుగుతుందని తెలిపారు. శిక్షణకు రిసోర్స్ పర్సన్‌లుగా కె. విజయభాస్కర్, ఓ. శ్రీనివాసరావు, పర్చూరు, కారంచేడు ఏపీఎంలు టి. మోహనరావు, కె.రామకృష్ణ, ఇంకొల్లు ఏపీఎం అనురాధ, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.


