జనవరి 25న విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో జనవరి 25న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన జేవీవీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 75 ఏళ్ల మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య విధానాలు మౌలిక అంశాలుగా కలిగివున్నదనీ, అభివృద్ధికర ఉన్నత సమాజ ఏర్పాటుకు మన రాజ్యాంగం ఎంతో కీలకమైనదని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ ప్రాధాన్యతను, గొప్పతనాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు తెలియజేసి, అవగాహన పెంపొందింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర సలహాదారు డాక్టర్ ఎం.గేయానంద్ మాట్లాడుతూ శాసీ్త్రయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా 38 ఏళ్ల క్రితం ఏర్పడిన జేవీవీ మూఢనమ్మకాల నిర్మూలన, శాసీ్త్రయ దృక్పథం పెంపుదల కోసం కృషి చేస్తోందన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు కేంద్రంగా చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపచేసేందుకు, సైన్స్ ప్రయోగాలపై ఆసక్తిని రేకెత్తించేందుకు, సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు, యురేకా వీడియో ఎక్స్పరిమెంట్ కాంపిటీషన్స్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. 2026 ఫిబ్రవరి మాసాన్ని సైన్స్ మాసోత్సవంగా పాటించాలన్నారు. తొలుత విశ్వం, భూమి ఆవిర్భావంపై ప్రత్యేకంగా రూపొందించబడిన జేవీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ యస్‌కే కాలేషా, సాహెబ్, కుర్రా రామారావు, సీహెచ్ జయప్రకాష్, బి.మాణిక్యం శెట్టి, పి.స్వరూపరెడ్డి, జీఎస్‌హెచ్‌పీ వర్మ, దార్ల బుజ్జిబాబు, జి.వెంకట్రావు, జాన్ బాబు, సునీత, దేవేంద్ర పాల్గొన్నారు.


